Nisar:
ఇస్రో మరో చారిత్రాత్మక విజయం
నిసార్ శాటిలైట్ ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట, స్వేచ్ఛ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘన విజయాన్ని అందుకుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నానాతో (NASA) రూపొందించిన ప్రతిష్టాత్మక నిసార్ (Nasa-Isro Synthetic Aperture Radar ) ఉపయోగాన్ని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5.40 గంటల సమయంలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-16 (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) ద్వారా నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశిత ఎస్ఎస్‌పీవోలో (Sun-Synchronous Polar Orbit) నిసార్‌ను (Nisar) విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో, ఇస్రో మరో కీలక మైలురాయిని అందుకున్నట్టు అయ్యింది. భూమికి సంబంధించిన అతిపెద్ద ఉమ్మడి ఎర్త్ సైన్స్ మిషన్‌గా ఇదే కావడం విశేషం.
అంతరిక్ష, వాతావరణ అంశాలలో మరింత స్పష్టమైన, అత్యంత కచ్చితమైన సమాచారం కోసం రూపొందించిన నిసార్ ఉపగ్రహం బరువు ఏకంగా 2,393 కేజీలు ఉంటుంది. నిసార్ మిషన్ కోసం నాసా, ఇస్రో సంయుక్తంగా ఏకంగా 1.5 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.12,500 కోట్లు వెచ్చించాయి. ఈ ఉపగ్రహం వాతావరణ మార్పులను గమనించడం, ప్రకృతి విపత్తుల విషయంలో సమయోచితంగా స్పందించేలా సమాచారం ఇవ్వడం వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు కీలకమైన సేవలు అందించవచ్చు. అమెరికా, భారత్ మధ్య చారిత్రాత్మక సహకారానికి నిసార్ ఒక మైలురాయిగా నిలిచింది.
భూమి స్కానింగ్
నిసార్ ఉపగ్రహం భూగ్రహ పరిశీలన, భూమిని అర్థం చేసుకోవడంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే, భూమిపై సంభవించే మార్పులను అత్యంత సూక్ష్మంగా సెంటీమీటర్ స్థాయిలో గుర్తించగలదు. ఈ సామర్థ్యంతో భూకంపాలు, పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడాన్ని, అగ్నిపర్వతాల గమనాలు, హిమానీనదుల కదలికలు వంటి ప్రకృతి విపత్తులను నిశితంగా గమనించేందుకు తోడ్పడుతుంది. నగరాల విస్తరణ, వ్యవసాయాభివృద్ధి, మౌలిక సదుపాయాల పేరిట మానవుల ప్రతికూల చర్యలు, వీటి దుష్ఫ్రభావాలను అత్యంత సూక్ష్మంగా గమనించేందుకు అవకాశం ఉంటుంది. ఈ శాటిలైట్ భూమి మొత్తాన్ని స్కాన్ చేయగలదు. అన్ని వాతావరణాలకు సంబంధించి, ప్రతి 12 గంటలకు ఒకసారి రాత్రి-పగలకు సంబంధించిన డేటా అందిస్తుంది. వివిధ కోణాల్లో ఉపయోగపడేలా వాతావరణ డేటాను విశ్లేషించి అందిస్తుంది. భూమిపై వృక్షజాతిలో మార్పులు, హిమానీనదాల కదలికలు వంటి భూఉపరితల మార్పులను కూడా నిశితంగా గమనించగలదు. ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేసి డేటా అందిస్తుంది.
సముద్రంలో నౌకలు, మంచు కరిగే ప్రభావం, తీర ప్రాంతాల పర్యవేక్షణ, తుఫాన్ల లక్షణాల విశ్లేషణ-అంచనా, నేలలో తేమ గుర్తింపు, ఉపరితల జల వనరుల మ్యాపింగ్, విపత్తులపై స్పందన వంటి ఎన్నో ప్రయోజనాలు నిసార్ ఉపగ్రహం ద్వారా పొందవచ్చు. డ్యువల్ ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ నిసార్ ఉపగ్రహాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. అంతరిక్షంలో తొలిసారిగా అమలు చేస్తున్న అత్యాధునిక విధానం. నాసా సమకూర్చిన ఎల్-బ్యాండ్ రాడార్ నేలలోకి, వృక్షావరణంలోకి చొచ్చుకుపోయి లోపలి మార్పులను గుర్తించి విశ్లేషించగలదు. ఇక, ఇస్రో అందించిన అందించిన ఎస్-బ్యాండ్ రాడార్ వృక్ష జాతుల ఎదుగుదల, భూప్రదేశ లక్షణాలను (ఎత్తుపల్లాలు) గుర్తించడంలో ప్రత్యేక టెక్నాలజీని కలిగి ఉంది.