NIA Has Arrested The Accused In The Rameswaram Cafe Blast Case : కర్నాటక రాజధాని బెంగళూరు మహానగరంలోని అత్యంత రద్దీగా ఉండే హోటల్ రామేశ్వరం కేఫ్. ఈ కేఫ్‌లో మార్చి 1న పేలుడు సంభవించింది.ఈ పేలుడుతో బెంగళూర్ ఉలిక్కిపడింది. బ్యాగులో ఐఈడీని తీసుకొచ్చిన నిందితుడు.. టైమర్ సెట్ చేసి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. అయితే, ఈ పేలుడు తీవ్రత తక్కువగా ఉండటం వల్ల అక్కడున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం ఎన్ఐఏ గాలింపు ముమ్మరం చేసింది. అంతేకాదు నిందితుడిని పట్టుకుంటే భారీ నజరానా ఇస్తామంటూ అనౌన్స్ చేసింది.ఈ క్రమంలో నిందితుడు కలిసిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంది ఎన్‌ఐఏ.
రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారు జామున సుమారు 4 గంటలకు బళ్లారిలో షబ్బీర్ అనే యువకుడిని అరెస్టు చేశారు. బళ్లారి కొత్త బస్టాండ్ వద్ద అతడిని అదుపులోనికి తీసుకుని బెంగళూరుకు తరలించారు. ఆ యువకుడు జిందాల్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బాంబు పేలుడుకు సంబంధించి ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో షబ్బీర్ పేరు బయటకు వచ్చింది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Read More: పెళ్లిళ్లు కుదిర్చే దైవం.. ఇడగుంజి గణపతి..!
పేలుడుకు పాల్పడిన నిందితుడితో షబ్బీర్ పలుసార్లు మాట్లాడినట్లు ఎన్ఐఏ గుర్తించింది. కేఫ్‌లో మార్చి 1 న పేలుడు అనంతరం బెంగళూరు నుంచి నిందితుడు తుమకూరు మీదుగా బళ్లారికి చేరుకున్నాడు. కౌల్‌బజార్‌లో షబ్బీర్‌ను కలిసి మాట్లాడాడు. అక్కడి నుంచి నిందితుడు హైదరాబాద్ వెళ్లేందుకు షబ్బీర్ సహకరించినట్టు ఈ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. మార్చి 1న ఉదయం 11.55 గంటలకు కేప్‌లో బాంబు అమర్చిన నిందితుడు.. అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నం 12.55 గంటలకు మారతహళ్లి- సిల్కుబోర్డు- గురగుంట పాళ్య మార్గాల్లో ట్రావెల్ చేశాడు.
చివరకు మధ్యాహ్నం 1.30 నిముషాలకి గురగుంటపాళ్యలో హుమ్నాబాద్‌కు వెళ్లే బస్సు ఎక్కాడు. సాయంత్రం 4 గంటలకు ఆ బస్సు కళ్లంబెళ్ల టోల్‌గేట్ దాటింది. అదే రోజు రాత్రి 9 గంటలకు బళ్లారి బస్టాండ్‌కు చేరుకుని..అక్కడ షబ్బీర్‌ను కలిసినట్లు గుర్తించారు. షబ్బీర్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. బళ్లారికి చెందిన మినాజ్ అలియాస్ సులేమాన్, సయ్యద్ సమీర్, ముంబయికి చెందిన అనాస్ ఇక్బాల్ షేక్, ఢిల్లీకి చెందిన శయాన్ రెహమాన్‌లను వివిధ జైళ్ల నుంచి అదుపులోకి తీసుకుని ఎన్‌ఐఏ అధికారులు తమదైన శైలీలో విచారిస్తున్నారు. పేలుడుకు కారణమైన నిందితుడి కోసం ఎన్‌ఐఏ, సీసీబీ పోలీసులు బెంగళూరు నగరాన్ని జల్లెడ పడుతున్నారు.
Read More: భారత్ మరో ముందడుగు,అగ్ని-5 క్షిపణి సక్సెస్
ముఖానికి మాస్క్ వేసుకున్న ప్రధాని నిందితుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కేఫ్‌తో పాటు నిందితుడు తిరిగిన ప్రాంతాల్లోని పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించి, వాటిని రిలీజ్ చేశారు. 30 ఏళ్ల వయసు ఉండే నిందితుడు.. భుజానికి బ్యాగు తగిలించుకుని కేఫ్‌లోకి వచ్చాడు. ఇడ్లీ ఆర్డర్ చేసి..ఐఈడీ ఉన్న బ్యాగును వదిలిపెట్టి వెళ్లడం కేఫ్‌లో ఉన్న సీసీ టీవీలో రికార్డయ్యింది. పేలుడు తర్వాత నిందితుడు పలుసార్లు గెటప్ మార్చినట్టు కూడా ఎన్‌ఐఏ గుర్తించింది.