Pamban Bridge: రవాణా వ్యవస్థలో వంతెనలకు ప్రత్యేక స్థానం ఉంది. రెండు ప్రాంతాల్ని కలపడంతో పాటు పర్యాటకంగా, ఆర్థికంగా అవి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయి. రెండు చీలిపోయే బ్రిడ్జీలను మనం సినిమాల్లో తరచూ చూస్తూనే ఉంటాం. అయితే భారత్ లోనూ మరో విధమైన మూవింగ్ బ్రిడ్జ్ తాజాగా రూపొందింది. శ్రీరామనవమి రోజున ప్రారంభోత్సవానికి సైతం సిద్ధమైంది. ఇంతకీ ఆ బ్రిడ్జి ఏది? ఎక్కడ నిర్మించారు? దాని నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు? వంటి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 6న ప్రారంభం
తమిళనాడులోని రామేశ్వరంలో ప్రతిష్టాత్మక బ్రిడ్జి (Pamban Bridge).. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నూతనంగా నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆవిష్కరించనున్నారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి (Srirama Navami) సందర్భంగా ఈ బ్రిడ్జిని ప్రధాని ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెనను నిర్మించడం విశేషం.
ఎంత ఖర్చు చేశారంటే
తమిళనాడు (Tamilnadu)లోని మండపం ప్రాంతం నుంచి పంబన్ దీవిలోని రామేశ్వరం (Rameshwaram) వరకు 2.10 కిలోమీటర్ల పొడవున ఈ బ్రిడ్జిని ఉంది. పాత బిడ్జి స్థానంలో ఈ కొత్త వంతెనకు ప్రధాని మోదీ.. 2019 నవంబర్ లో శంకుస్థాపన చేశారు. దీనికోసం దాదాపు రూ. 535 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చుతో రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (Rail Vikas Nigam Limited) సంస్థ ఈ వంతెనను నిర్మించింది.
Read Also: Doctors Deliver Baby: నడిరోడ్డుపై యువతికి ప్రశవం.. డాక్టర్లపై నెటిజన్ల ప్రశంసలు.. ఎందుకంటే?
విమానంలా గాల్లోకి
పంబన్ వంతెన ప్రత్యేకత విషయానికి వస్తే.. ఈ బ్రిడ్జి అమాంతం పైకి లేచే గుణాన్ని కలిగి ఉంది. సముద్రంలో వెళ్లే పడవులు ఈ వంతెన వద్దకు వచ్చినప్పుడు వాటికి దారినిచ్చేందుకు పంబన్ బ్రిడ్జి వర్టికల్ గా పైకి (Vertical Lift) లేస్తుంది. 22 మీటర్ల ఎత్తు వరకూ లేచి నౌకలకు దారి ఇస్తుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నౌకలు బ్రిడ్జి గుండా ప్రయాణిస్తాయి. నౌకలు వంతెనను క్రాస్ చేసిన తర్వాత తిరిగి యథాస్థితిలోకి పంబన్ బ్రిడ్జి వచ్చేస్తుంది. వర్టికల్ లిఫ్ట్ మెకానిజం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రైల్వే బ్రిడ్జికి ప్రత్యేకత ఉంది.
1915లో నిర్మాణం
తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జిని ఆంగ్లేయులు నిర్మించారు. 1915వ సంవత్సరంలో నిర్మించిన ఈ బ్రిడ్జి 2019 వరకూ సేవలు అందిస్తూ వచ్చింది. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగంతో రైలు మార్గం ద్వారా కలిపే వంతెన ఇదే. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతానికి ఉదాహరణగా చెబుతుంటారు. దేశంలోని ఏకైక వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి ఇదే కావడం విశేషం.