Madras High Court: కేంద్రం – తమిళనాడు ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ విద్యావిధానం (NEP)లో త్రిభాష విధానాన్ని తీసుకొచ్చి కేంద్రం తమపై హిందీని రుద్దాలని చూస్తోందంటూ అధికార డీఎంకే (DMK) ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లోనూ డీఎంకే నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు (Madras High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఓ కేసు విచారణ సందర్భంగా మాతృభాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అసలేం జరిగిందంటే
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే అభ్యర్థులకు తప్పనిసరిగా తమిళ భాషపై పట్టు ఉండాలని మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ (Madurai Bench) స్పష్టం చేసింది. ఎం.జయకుమార్ అనే వ్యక్తికి తమిళం రాకపోవడంతో తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (Tamil Nadu Electricity Board).. ఉద్యోగం నుంచి తీసివేసింది. దీనిని సవాలు చేస్తూ ఆయన హైకోర్టు బెంచ్ ను ఆశ్రయించారు. తన తండ్రి నేవీలో పనిచేస్తుండటం వల్ల సీబీఎస్ఈ (CBSE) స్కూల్లో చదివానని జయకుమార్ కోర్టుకు తెలియజేశారు. అందువల్ల తమిళం నేర్చుకోవడం కుదరలేదని విజ్ఞప్తి చేశారు. అయితే హైకోర్టు బెంచ్ అతడి వ్యాఖ్యలను ఖండిస్తూ పిటిషన్ ను తోసిపుచ్చింది.
హైకోర్టు చురకలు
కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా మాతృ భాష వచ్చి ఉండాలని తేల్చి చెప్పింది. తమిళం రాయడం, చదవడం వంటివి కచ్చితంగా వచ్చితీరాలని స్పష్టం చేసింది. ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు మాతృభాష తెలియకుంటే ఎలా అని ప్రశ్నించింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వహించలేరని అభిప్రాయపడింది. రాష్ట్రంలో భాషా యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Also Read: IMD Cyclone Alert: ఇదేం విడ్డూరం.. సమ్మర్ లో భారీ వర్ష సూచన
కేంద్రంతో గొడవేంటి?
జాతీయ విద్యావిధానం(NEP)లో త్రిభాషా సూత్రాన్ని కేంద్రం ప్రతిపాదించింది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే దీనిని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాము ఇంగ్లీషు, తమిళం అనే ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేస్తున్నారు. తమపై హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని పేర్కొన్నారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం త్రిభాష విధానంపై కేంద్ర వైఖరిని తప్పుబట్టారు.