Jaishankar on Trump: భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించడం ఒక్కటే కాదు, ఇతర అనేక దేశాల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా నడుచుకుంటున్నారు. అత్యంత నిశితంగా, హూందాతనంగా నిర్వహించే విదేశాంగ విధానాన్ని ఆయన హాస్యాస్పదంగా మార్చివేస్తున్నారంటూ సొంత దేశంలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పదునైన (Jaishankar on Trump) విమర్శలు చేశారు.
అమెరికా విదేశాంగ విధానాన్ని గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటిమాదిరిగా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా మార్చివేసిన అమెరికా అధ్యక్షుడిని గతంలో ప్రపంచం ఎప్పుడూ ఎరుగదని ఆయన చురకలు అంటించారు. ఇలా నడుచుకుంటున్న ఏకైక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనని విమర్శించారు. ఈ మేరకు ‘‘2025 ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్’లో జైశంకర్ వ్యాఖ్యానించారు.
సంప్రదాయమైన పద్ధతులకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారని జైశంకర్ విమర్శణాస్త్రాలు సంధించారు. ట్రంప్ విధానం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచంతో పాటు, తన సొంత దేశంతో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సంప్రదాయమైన పద్ధతులకి భిన్నంగా పని చేస్తున్నారని ఎత్తిచూపించారు.
ఆపరేషన్ సిందూర్‌లో ట్రంప్ జోక్యం లేదు
ఈ ఏడాది మే నెలలో భారత్–పాకిస్థాన్ మధ్య జరిగిన సైనికఘర్షణ ముగింపునకు తాను మధ్యవర్తిత్వం వహించినట్టుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి జైశంకర్ ఖండించారు. ఆపరేషన్ సిందూర్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం వెనుక ఎవరి హస్తమూ లేదని అన్నారు. గత 50 ఏళ్లుగా, అంటే, 1970ల నుంచే భారత్ ఒకే విధానాన్ని పాటిస్తోందని, పాకిస్థాన్‌తో సంబంధాలలో విషయంలో మూడవ దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదని, ఈ అంశంపై ఏ నాటి నుంచో అంగీకారం ఉందని పేర్కొన్నారు. ఇక, భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంపై కూడా జైశంకర్ స్పందించారు. ఏ దేశంతో, ఎలాంటి వాణిజ్య చర్చల్లోనైనా దేశ రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని జైశంకర్ స్పష్టం చేశారు.
Read Also- CBI Raids Anil Ambani Home: అనిల్ అంబానీ నివాస ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు
రైతులకు సంబంధించిన వ్యవహారాలు, వ్యూహాత్మక నిర్ణయాలు, మధ్యవర్తిత్వం ఇలా అన్ని అంశాల్లోనూ భారతదేశానికి స్పష్టమైన విధానం ఉందని జైశంకర్ వెల్లడించారు. తమ అభిప్రాయాలతో ఎవరైనా విభేదిస్తే, నేరుగా వెళ్లి ప్రజలకు చెప్పవచ్చని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పండి అంటూ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. వ్యాపార అనుకూలంగా వ్యవహరించే అమెరికా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నవారిని చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు.
‘‘భారతదేశం నుంచి ముడి చమురు, లేదా శుద్ధి చేసిన ఉత్పత్తులు కొనడం మీకు సమస్య ఉందా? అయితే కొనకండి. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. యూరప్ కొంటోంది. అమెరికా కొంటోంది. మీకు నచ్చకపోతే, కొనొద్దు’’ అని జైశంకర్ విమర్శనాస్త్రాలు సంధించారు.