Malegaon Blast Case
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Malegaon Case: మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. బీజేపీ మాజీ ఎంపీ సహా అందరూ నిర్దోషులే

Malegaon Case: దాదాపు 17 ఏళ్లక్రితం మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుడు కేసులో గురువారం సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏడుగురిని న్యాయస్థానం నిర్దోషులుగా ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ మాజీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పూరోహిత్ కూడా ఉన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక జడ్జి ఏకే లాహోటీ స్పందిస్తూ.. కేవలం అనుమానాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లలేమని అన్నారు. నిందితులపై ఆరోపణలను సాక్ష్యాధారాలతో రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అనుమానాలు తప్ప ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు
‘‘జరిగింది తీవ్రమైన ఘటనే. కానీ, కేవలం వ్యక్తుల నైతికత ఆధారంగా దోషి అని నేరాన్ని నిర్ణయించలేం. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు. అయితే, కేవలం నైతికత ఆధారంగా నేరస్తుడిగా నిర్ణయించలేం’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. హిందూ సిద్ధాంతాలను విశ్వసించే కొన్ని సంస్థలకు సంబంధించిన వ్యక్తుల అరెస్టుతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజా తీర్పుతో ప్రగ్యా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పూరోహిత్‌తో పాటు మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహిర్కర్, సుధాకర్ ధర్ ద్వివేది అలియాస్ శంకరాచార్య, సమీర్ కులకర్ణి ఉన్నారు.

Read Also- HYD News: హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ గుడ్‌న్యూస్.. కేవలం 5 రూపాయలకే..

ఏటీఎస్ ఆరోపణలు ఇవే
మాలేగావ్ పేలుడు ఒక పథకం ప్రకారం జరిగిందని ఏటీఎస్ ఆరోపించింది. గతంలో జరిగిన ఘటనకు ముస్లింలపై ప్రతీకారంగా అభినవ్ భారత్ అనే హిందూ రైట్ వింగ్ గ్రూప్ పేలుళ్లకు పాల్పడిందని పేర్కొంది. పేలుడులో ఉపయోగించిన మోటార్ సైకిల్‌కి ప్రజ్యా సింగ్ ఠాగూర్ యజమాని అని పేర్కొంది. 2008లో ఆమెను అరెస్ట్ చేశారు. ఇక, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పూరోహిత్ అప్పట్లో ఆర్మీ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తుండగా, పేలుడు పదార్థాలను సమకూర్చడంలో సహాయపడ్డారని, అభినవ్ భారత్ సమావేశాల్లో పాల్గొన్నారంటూ ఎటీఎస్ ఆరోపించింది.

సాక్ష్యాల్లేవ్..
ప్రగ్యా సింగ్ ఠాకూర్, పూరోహిత్‌లకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని కోర్టు తీర్పునిచ్చింది. లెఫ్టినెంట్ కర్నల్ పూరోహిత్ ఆర్‌డీఎక్స్ తీసుకొచ్చారడానికి, బాంబు అమర్చారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం వ్యక్తం చేసింది. పేలుడులో ఉపయోగించిన బైకు యజమాని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అని నిరూపించే, నమ్మదగిన ఆధారాలు ఏమీలేవని జడ్జి జస్టిస్ ఏకే లాహోటీ స్పష్టం చేశారు. బైకు చాసిస్ నంబర్‌ను ఫోరెన్సిక్ నిపుణులు పూర్తిగా గుర్తించలేకపోయారని, అందుకే, ఆ బైకు ప్రగ్యా ఠాకూర్‌దని నిర్ధారించలేకపోయిందని కోర్టు పేర్కొంది. ప్రగ్యా ఠాకూర్ పేలుడు జరగడానికి రెండు సంవత్సరాల ముందే సన్యాసినిగా మారారని, భౌతిక సంబంధాలన్నీ వదిలేసినట్టు గుర్తించినట్టు కోర్టు పేర్కొంది.

‘అభినవ్ భారత్’ సంస్థ ఎలాంటి ఉగ్రవాద చర్యల్లో పాల్గొనలేదని, ఇందుకు సంబంధించి సాక్ష్యాలు ఏమీ లేవని కోర్టు తేల్చిచెప్పింది. అభినవ్ భారత్‌ను ఉగ్రవాద చర్యలకు ఉపయోగించారనడానికి పక్కా ఆధారాలు లేవని, కీలకమైన సాక్షులు కూడా ప్రాసిక్యూషన్ వాదనకు మద్దతు ఇవ్వలేదని, కుట్ర సమావేశాలు జరిగినట్టు రుజువు కాలేదని జడ్జి పేర్కొన్నారు. పేలుడులో 6 మంది మృతి చెందినట్టుగా అంగీకరించిన న్యాయస్థానం, 101 మంది గాయపడ్డారంటూ ప్రాసిక్యూషన్ చేసిన వాదనను తిరస్కరించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Read also- Health: ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకొని తింటున్నారా?.. శరీరంలో ఏం జరుగుతుందంటే?

ప్రగ్యా, పూరోహిత్ స్పందనలు ఇవే
తీర్పు వెలువడిన తర్వాత ప్రగ్యా సింగ్ ఠాకూర్ భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ తీర్పును హిందూత్వ విజయంగా ఆమె అభివర్ణించారు. ‘‘గత 17 ఏళ్లుగా నా జీవితం నాశనం అయ్యింది. భగవంతుడిని అవహేళన చేయాలని ప్రయత్నించిన వారిని దేవుడు శిక్షిస్తాడు. ఇవాళ కాషాయం గెలిచింది. హిందుత్వ గెలిచింది. హిందూ ఉగ్రవాదం అనే ఆరోపణ అవాస్తవమని కోర్టు నిరూపించింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. లెఫ్టినెంట్ కర్నల్ పూరోహిత్ ఎవరిపేరును ప్రస్తావించకుండానే స్పందించారు. ‘‘నేను ఈ దేశాన్ని నిస్వార్థంగా ప్రేమించే ఒక జవాన్. మానసిక వ్యాధులతో బాధపడే కొంతమంది కారణంగా నేను బాధితుడిని అయ్యాను. కొంతమంది వారి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. మనం సహించాల్సి వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు.

కాగా, మాలేగావ్ బాంబు పేలుడు ఘటన 2008 సెప్టెంబర్ 29న జరిగింది. రంజాన్ మాసంలో, ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసించే మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో ఈ పేలుడు జరిగింది. ఒక మోటార్ సైకిల్‌‌కు (LML ఫ్రీడమ్ బైక్) బాంబును అమర్చి పేల్చివేశారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసును ప్రారంభంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విచారించింది. 2011లో కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఏఐ‌కి (NIA) అప్పగించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు