Terror Plot Foiled: గత సోమవారం ఢిల్లీలో పేలుడు, అంతకుముందు ఫరీదాబాద్‌లో ఉగ్రవాదులతో లింకులున్న వైద్యుల అరెస్ట్ నేపథ్యంలో పంజాబ్‌లో మరో ఉగ్ర లింక్ (Terror Plot Foiled) బయటపడింది. పాకిస్థాన్ ఐఎస్ఐ సాయంతో భారీ గ్రెనేడ్ దాడులకు పాల్పడాలని పథక రచన చేసిన 10 మంది కీలక నిందితులను లూథియానా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వెనుకున్న హ్యాండర్లు, పాక్ ఐఎఎస్ కనుసన్నల్లో మలేషియాలో ఉన్నట్లు భావిస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. మలేషియాలో ఉన్న పాక్‌కు చెందిన ముగ్గురు హ్యాండర్ల ద్వారా సంప్రదింపులు జరిపి హ్యాండ్ గ్రెనేడ్లను సేకరించడం, వాటిని డెలివరీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామని లూథియానా సిటీ పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు రద్దీ ప్రాంతాల్లో గ్రెనేడ్ దాడులు చేయడం నిందితుల టార్గెట్ అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు.
Read Also- Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!
పట్టుబడిన నిందితులకు మలేషియాలో ఉన్నట్లు అనుమానిస్తున్న పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌తో (ఐఎస్‌ఐ) సంబంధాలు ఉన్నాయని, ఆ ముగ్గురు విదేశీ సూత్రధారులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతున్నట్టు లూథియానా సిటీ పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ వివరించారు. ఇక అరెస్ట్ చేసినవారు పేర్లు అజయ్ అలియాస్ అజయ్ మలేషియాతో పాటు జస్స్ బెహబల్, రాజస్థాన్ నివాసి పవన్‌దీప్‌గా గుర్తించామని చెప్పారు. రాష్ట్రంలోని ముక్త్‌సర్ సాహిబ్‌కు చెందిన కుల్దీప్ సింగ్, శేఖర్ సింగ్, అజయ్ సింగ్ అలియాస్ అజయ్ అనే మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు వివరించారు.
అక్టోబర్ 27న నిందితుడు కుల్దీప్ ‘లైవ్ చైనీస్ హ్యాండ్‌గ్రెనేడ్’, ఒక నల్ల కిట్, ఒక సెట్ గ్లవ్స్‌తో అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారం బయటపడిందన్నారు. తొలుత బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 113 (ఉగ్రవాద చర్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఆ తర్వాత అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (UAPA)లోని సంబంధిత సెక్షన్లను కూడా జోడించినట్టు పోలీసులు వివరించారు. కుల్దీప్ తర్వాత, శేఖర్, అజయ్ అనే అతడి సహచరులను కూడా అరెస్టు చేశామని తెలిపారు. అమ్రిక్ సింగ్, పర్మిందర్, విజయ్ అనే మరికొందరు నిందితులను వేర్వేరు జైళ్ల నుంచి వారెంట్‌పై తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు.
