Delhi Fire Accident: ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం (Delhi Fire Accident) జరిగింది. ఈసారి ఏకంగా ఎంపీలకు కేటాయించిన అపార్ట్‌మెంట్లలోనే ప్రమాదం జరిగింది. నగరంలోని బీడీ మార్గ్‌లో రాజ్యసభ ఎంపీలకు కేటాయించిన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్లలో శనివారం భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్న 1 గంట సమయంలో భారీగా మంటలు వ్యాపించి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, అపార్ట్‌మెంట్లలోని ఫర్నీచర్ కాలిపోయినట్టుగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ బిల్డింగ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020లో ప్రారంభించారు. ఎంపీలకు కేటాయించిన అధికారిక నివాసాలలో ఒకటిగా ఉంది. పార్లమెంట్ భవనానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ బిల్డింగ్‌లో పలువురు రాజ్యసభ ఎంపీలు నివాసం ఉంటున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.
ఈ అగ్నిప్రమాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్డింగ్‌లో నివసించే వారంతా రాజ్యసభ ఎంపీలేనని, 30 నిమిషాలు గడిచాక కూడా ఒక్క ఫైరింజన్ రాలేదని ఆయన చెప్పారు. ఈ భవనం పార్లమెంట్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉందని, ఎన్నిసార్లు కాల్ చేసినా ఫైర్ ఇంజిన్లు రాలేదని వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుండాలని సాకేత్ గోఖలే మండిపడ్డారు.
Read Also- Sundar Pichai: నేను చూశాను.. వైజాగ్‌కు సుందర్ పిచాయ్ కితాబ్.. ఏమన్నారో తెలుసా?
కాగా, తమకు 1:20 గంటల సమయంలో సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. వెంటనే ఆరు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వెళ్లాయని అధికారులు తెలిపారు. అగ్నిక ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియదు లేదు. కానీ, కొందరు ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ, అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫైర్ హైడ్రెంట్ పని చేయలేదని, ట్యాంకులోనూ, పైపులలోనూ నీరు లేకపోవడంతో మంటలు మరింత వ్యాపించాయని పేర్కొన్నారు.
అపార్ట్‌మెంట్ మూడవ అంతస్థులో నివసించిన వినోద్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ఈ అగ్ని ప్రమాదంలో తన భార్య, పిల్లలలో ఒకరికి గాయాలయ్యాయని చెప్పారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. కొన్ని నెలల్లో తన కూతురి పెళ్లి ఉందని, ఈ సమయంలో ఇంట్లో ఉన్న బంగారం, నగలు, దుస్తులు కాలిపోయాయని వాపోయారు.
