New Rule for Uber Ola Rapido: ప్రస్తుతం ఓలా, ఉబర్, రాపిడో సేవలు ప్రతి నగరంలో తప్పనిసరిగా మారిపోయాయి. స్కూల్, కాలేజీ, ఆఫీస్, బస్టాండ్ ఇలా ఎక్కడికి చేరుకోవాలన్న నగరవాసులు చాలా వరకూ క్యాబ్ సేవలను వినియోగిస్తున్నారు. గణనీయ సంఖ్యలో ప్రజలు వినియోగిస్తుండటం, భద్రతా వైఫల్యాల కారణంగా సమస్యలు వస్తుండటంతో ప్రభుత్వాలు.. ఈ క్యాబ్ సేవలపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సర్కార్.. క్యాబ్ సేవలకు సంబంధించి ప్రత్యేక పాలసీని రూపొందించింది. అందులో చేర్చిన నిబంధనలు ప్రస్తుతం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా పాలసీని తీసుకురావాలన్న డిమాండ్.. క్యాబ్ వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది.
పాలసీ ఉద్దేశ్యం ఇదే
మహారాష్ట్ర ప్రభుత్వం 2025 మే 1న ‘అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ 2025’ (New Aggregator Cabs Policy 2025) ని అమల్లోకి తీసుకొచ్చింది. ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్ సేవలను నియంత్రించడానికి ఈ పాలసీని రూపొందించింది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడంతో పాటు క్యాబ్ డ్రైవర్ల సంక్షేమాన్ని పెంపొందించడం ఈ పాలసీ ఉద్దేశ్యమని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ధరల పారదర్శకతకు ఈ పాలసీ అద్దం పడుతుందని పేర్కొంది.
పాలసీ తెచ్చిన మార్పులు
ఓలా (Ola), ఉబర్ (Uber), రాపిడో (Rapido) సేవల్లో ప్రయాణికులు ప్రధానంగా ఫేస్ చేసే సమస్య అధిక చార్జీలు. దీనిని నివారించేందుకు మహారాష్ట్ర సర్కార్.. పాలసీలో కొత్త రూల్స్ చేర్చింది. దీని ప్రకారం సర్జ్ ధరలు గరిష్టంగా ప్రాథమిక ధరకు 1.5 రెట్లు మించి ఉండటానికి వీల్లేదు. అంతేకాదు పెద్దగా బుకింగ్స్ ఉండని ఆఫ్ పీక్స్ సమయాల్లో 25% వరకు డిస్కౌంట్లు ఇవ్వాలని సూచించింది.
డ్రైవర్ కు జరిమానా?
ఒకసారి రైడ్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే వినియోగదారుడిపై క్యాబ్ యజమాన్యాలు కొంతమెుత్తంలో జరిమానా విధిస్తుంటాయి. అయితే ఈ పాలసీ ద్వారా డ్రైవర్ పైన కస్టమర్ జరిమానా విధించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎవరైనా డ్రైవర్.. ప్రయాణికుడి రైడ్ ను రద్దు చేస్తే రూ. 100 లేదా బుక్ చేసుకున్న ధరలో 10% (ఏది తక్కువైతే) చెల్లించేలా నిబంధన రూపొందించారు. ఒకవేళ ప్రయాణికుడే రైడ్ ను రద్దు చేస్తే డ్రైవర్ కు రూ. 50 లేదా మెుత్తం ధరలో 50% (ఏది తక్కువైతే) చెల్లించేలా నిబంధన పెట్టింది.
భద్రతకు భరోసా
ఈ పాలసీలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి మహారాష్ట్ర సర్కార్ కొన్ని సూచనలు చేసింది. ప్రతీ క్యాబ్ లో GPS ట్రాకింగ్, ఎమర్జెన్సీ బటన్ ను తప్పనిసరి చేసింది. డ్రైవర్లకు పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని సూచించింది. అలాగే మహిళా ప్రయాణికులు.. మహిళా డ్రైవర్లను ఎంపిక చేసుకునే సౌకర్యం కల్పించాలని క్యాబ్ సంస్థలకు సూచించింది. షేరింగ్ విధానంలో తమతో పాటు వేరే వారు ప్రయాణించాలా? వద్దా? అన్నది మహిళా ప్రయాణికురాలి సూచన మేరకే ఉండాలని కొత్త పాలసీలో స్పష్టం చేసింది.
డ్రైవర్ల సంక్షేమానికి
క్యాబ్ డ్రైవర్ల సంక్షేమానికి సైతం అగ్రిగేటర్ పాలసీ కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతీ డ్రైవర్.. ధరలో కనీసం 80% పొందేలా సూచనలు చేసింది. అంతేకాకుండా డ్రైవర్లకు మెడికల్ ఇన్సూరెన్స్, శిక్షణ, ఇతర సంక్షేమ ప్రయోజనాలను ఉబర్, ఓలా, రాపిడో వంటి సంస్థలే చూసుకోవాలని మహారాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. తక్కువ రేటింగ్ పొందిన డ్రైవర్లకు తప్పనిసరిగా రిఫ్రెషర్ శిక్షణ ఇప్పించాలని సూచించింది. వాటితో పాటు ప్రతీ క్యాబ్ కంపెనీ.. ఫిజికల్ గా ఆఫీసులను మెయిన్ టెన్ చేయాలని పాలసీలో చెప్పింది.
Also Read: Dost Registration 2025: గుడ్ న్యూస్.. నేటి నుంచే అప్లికేషన్స్.. ఇలా అప్లై చేయండి!
రవాణాశాఖకు బాధ్యత
ఈ పాలసీలోని నిబంధనలు అన్ని అమలయ్యే బాధ్యతను రాష్ట్ర రవాణా శాఖకు మహా సర్కార్ అప్పగించనుంది. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే పాలసీని తెలుగు రాష్ట్రాల్లోనూ తీసుకురావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. దీనివల్ల క్యాబ్ సంస్థలు, డ్రైవర్లలో జవాబుదారీ తనాన్ని, భద్రతను తీసుకురావొచ్చని పేర్కొంటున్నారు.