Maharashtra Crime: హనీమూన్ మర్డర్ కేసు మరువక ముందే దేశంలో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లైన 3 వారాలకే ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై గొడ్డలితో దాడి చేయడంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
వివరాల్లోకి వెళ్తే
మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతానికి చెందిన అనిల్ లోఖండే (50), రాధిక (29) భార్య భర్తలు. తనకంటే వయసులో చాలా చిన్నదైన రాధికను మూడు వారాల క్రితమే అనిల్ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి అనిల్ దారుణ హత్యకు గురయ్యారు. భర్త ఆయుష్షు కోసం పూజ చేసే పరమ పవిత్రమైన వత్ పూర్ణిమ రోజున కట్టుకున్న భార్యే అతడ్ని గొడ్డలి వేటుతో నరికి చంపింది. అంతేకాదు తన భర్తను తానే చంపినట్లు బయటకు వచ్చి స్వయంగా బంధువులకు తెలియజేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భర్త అనిల్ ను భార్య రాధిక ఎందుకు హత్య చేసిందన్న విషయం మాత్రం బయటకు రాలేదు.
బంధువుల సూచనతో పెళ్లి
50 ఏళ్ల అనిల్ కు గతంలోనే పెళ్లి జరిగింది. ఆమె మెుదటి భార్య క్యాన్సర్ తో మరణించింది. అనిల్ మెుదటి భార్యకు ఇద్దరు సంతానం కాగా.. వారిద్దరు పెళ్లిళ్లు చేసుకొని తమ జీవితాలను గడుపుతున్నారు. ఈ క్రమంలో అనిల్ గత కొంతకాలంగా ఒంటరి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. బంధువులు రెండో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో సతారా జిల్లా వాది గ్రామానికి చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం మే 17న జరిగినట్లు బంధువులు చెబుతున్నారు. పెళ్లైన తర్వాత వారు గొడవ పడుతున్నట్లు తాము చూడలేదని అన్నారు. ఇంతటి దారుణానికి రాధిక ఎందుకు ఒడిగట్టిందో తమకూ తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Coronavirus Cases India: దేశంలో కరోనా ప్రకంపనలు.. 24 గంటల్లో భారీగా కేసులు.. ఎంతంటే?
బెంగళూరులో మరో ఘటన
మరోవైపు కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఓ భార్య రెచ్చిపోయింది. అక్రమ సంబంధానికి కుటుంబం అడ్డుగా ఉందని భావించి వారిని అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. బెలూర్ ప్రాంతంలో నివసిస్తున్న గజేంద్ర, చైత్ర భార్య భర్తలు. 11 ఏళ్ల క్రితం వారికి వివాహం కాగా.. ఇద్దరు కుమారులు. అయితే ఆమెకు స్థానికంగా ఉండే శివు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే వారి బంధానికి భర్త, పిల్లలు అడ్డుగా ఉన్నారని చైత్ర భావించింది. తినే ఆహారంలో తక్కువ మోతాదులో విషం మాత్రలు కలపడం ప్రారంభించింది. ఇది గమనించిన భర్త గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.