IRCTC Scam Case: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆర్‌జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) పార్టీకి ఎవరూ ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలకు మరికొన్ని వారాల సమయం మాత్రమే ఉన్న ఈ తరుణంలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఐఆర్‌సీటీసీ స్కామ్ కేసులో (IRCTC Scam Case) ఆర్జేడీ వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కొడుకు తేజస్వి యాదవ్ పేర్లను చేర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అవినీతి నిరోధక చట్టం, మోసం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కుటుంబ సభ్యులు ముగ్గురు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాలూ యాదవ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి నేరపూరిత కుట్రలో భాగమయ్యారని, తన పదవిని దుర్వినియోగం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక, రాబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లపై మోసం, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. ఈ పరిణామం ఆర్జేడీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారనుంది. ముఖ్యంగా, ఎన్నికలకు ముందు ఈ కేసు తెరపైకి రావడంతో ప్రత్యర్థి పార్టీలు ప్రచారాస్త్రంగా మలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మోసం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి, చీటింగ్ కేసుగానే విచారించాల్సి ఉంటుందని రౌస్ అవెన్యూ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగడం ఏ రూపంలో జరిగినా నష్టమే కదా అని స్పష్టం చేసింది. చాలా తెలివిగా కుట్రకు పాల్పడ్డారని, కానీ అది దాగలేదని పేర్కొంది. ప్రాథమిక విచారణలో ఇతర నిందితులతో కలిసి లాలూ యాదవ్ కుట్రలో భాగస్వామ్యం ఉన్నట్టుగా అనిపిస్తోందని, తన పదవిని దుర్వినియోగం చేసి, టెండర్లను తనకు అనుకూలంగా కేటాయింపుచేయడంలో ప్రభావం చూపినట్టుగా అనిపిస్తోందని విచారణ జరపాల్సిందేనని కోర్టు పేర్కొంది. కాంట్రాక్టులకు బదులుగా తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేయడం ఈ విషయాన్ని బలపరుస్తోందని అభిప్రాయపడింది.
Read Also- PCC Mahesh Kumar Goud: ఖాళీగా ఉన్న కేంద్ర రాష్ట్ర పోస్టులను భర్తీ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్
అసలేంటి కేసు?
లాలూ ప్రసాద్ యాదవ్ 2004 -2009 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పనిచేశారు. నాడు ఆయన పర్యవేక్షణలో ఉన్న రైల్వే శాఖలో ఐఆర్‌సీటీసీ హోటల్స్‌కు సంబంధించిన కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీ హోటళ్ల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టులను ‘సుజాతా హోటల్’ అనే హోటల్ యాజమాన్యానికి అప్పగించారని, దానికి బదులుగా లాలూ యాదవ్‌కు మూడు ఎకరాల పొలం తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. బినామీ కంపెనీ ద్వారా ఈ భూమి తీసుకున్నారంటూ దర్యాప్తులో చేపట్టిన సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ ఆరోపణలపై సీబీఐ 2017లోనే లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుల అవినీతిని నిరూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే, లాలూ యాదవ్ న్యాయవాది మాత్రం సీబీఐ వాదనలను తప్పుబట్టారు. అభియోగాలు నమోదు చేయడానికి సరైన ఆధారాలు లేవని, ఐఆర్‌సీటీసీ టెండర్ల ప్రక్రియ చట్టప్రకారమే జరిగిందని కోర్టులో వాదించారు.
మేం ఏ తప్పూ చేయలేదు: రబ్రీదేవి
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు సోమవారం స్పందించారు. తాము ఎలాంటి నేరం చేయలేదని, కోర్టు విచారణను దైర్యంగా ఎదుర్కొంటామని రబ్రీదేవి చెప్పారు. ఇదొక తప్పుడు కేసు అని ఆమె వ్యాఖ్యానించారు.
Read Also- Actress Vishnupriya: తెలుగు వాళ్ళకి అవకాశాలు వచ్చినా సీరియల్స్ చెయ్యట్లేదు.. నటి సంచలన కామెంట్స్
