Kerala Murder: జీవితాంతం తోడూనీడగా సాఫీగా సాగాల్సిన సంసారాలు వివాహేతర సంబంధాలతో విచ్ఛిన్నం అవుతున్నాయి. ఏకంగా జీవిత భాగస్వాములనే బలిదీసుకొనే స్థాయికి దిగజారుతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాలు సహా యావత్ దేశం మెుత్తం కనిపిస్తున్నాయి. తాజాగా కేరళలోనూ ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. ఓ వాట్సప్ ఎమోజీ కారణంగా భార్య, స్నేహితుడ్ని ఓ వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు.
వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని పతనంతిట్ట జిల్లా కలంజూరు ప్రాంతానికి చెందిన బైజు – వైష్ణవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు సైతం ఉన్నారు. అయితే వారి ఇంటి పక్కనే విష్ణు అనే వ్యక్తి తన తల్లితోపాటు జీవిస్తున్నాడు. అతడికి బైజుతో మంచి స్నేహం కూడా ఉంది. ఈ క్రమంలో తాజాగా బైజు భార్య వైష్ణవి వాట్సాప్ కు విష్ణు లవ్ ఎమోజీని పంపాడు. అది చూసిన బైజు కోపంతో రగిలిపోయాడు. వెంటనే దాని గురించి భార్యతో గొడవకు దిగాడు. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించాడు.
పెరట్లోకి లాక్కెళ్లి మరి..
వైష్ణవితో గొడవ తీవ్రస్థాయికి చేరడంతో బైజు కోపం పట్టలేక కొడవలి అందుకున్నాడు. దీంతో వైష్ణవి భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న విష్ణు ఇంటికి వెళ్లిపోయింది. మరింత ఆగ్రహం తెచ్చుకున్న బైజు.. భార్యను బయటకు రమ్మని బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో ఆమె భయపడి రాగా ఆమె జుట్టు పట్టుకొని పక్కనే ఉన్న పెరట్లోకి లాక్కెళ్లాడు. చేతిలో ఉన్న కొడవలితో అతి దారుణంగా ఆమెను నరికాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన విష్ణుపై కూడా కొడవలితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే బైజుని అడ్డుకోని రక్తపు మడుగులో ఉన్న విష్ణు, వైష్ణవిని హుటాహాటీనా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వైష్ణవి చనిపోగా.. మార్గ మధ్యలో విష్ణు ప్రాణాలు వదిలాడు.
Read Also: MK Stalin: ‘అత్యవసరంగా పిల్లల్ని కనండి’.. ప్రజలకు సీఎం పిలుపు
బైజును అరెస్టు చేసిన పోలీసులు
భార్య, స్నేహితుడిపై దారుణంగా దాడి చేసిన తర్వాత బైజు.. తాపిగా ఇంట్లోకి వెళ్లి స్నానం చేశాడు. బట్టలు మార్చుకొని స్నేహితుడికి ఫోన్ చేశాడు. జరిగినదంతా ఫ్రెండ్ కు చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే బైజును అరెస్టు చేశారు. చనిపోయిన విష్ణుకు ఇంకా పెళ్లి కాలేదని పోలీసులు తెలిపారు. అతడు రోజూ బైజుతో కలిసే పనికి వెళ్లేవాడని పేర్కొన్నారు.