CJI Surya Kant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu).. 53వ ప్రధాన న్యాయమూర్తి (53rd Chief Justice of India)గా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ ప్రమాణోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah), రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh), లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
14 నెలల పాటు పదవిలో..
అంతకుముందు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2)ను అనుసరించి సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. గత సీజేఐ బి.ఆర్. గవాయి (Justice Bhushan R Gavai) పదవి కాలం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆయన నేటి 14 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు. అంటే 2027 ఫిబ్రవరి 9 వరకూ ఆయన సీజేఐ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
VIDEO | Delhi: Justice Surya Kant takes oath as the 53rd Chief Justice of India.
He has been part of key verdicts on the abrogation of Article 370, Bihar electoral roll revision, and the Pegasus spyware case. Appointed on October 30, he will serve for nearly 15 months and demit… pic.twitter.com/4cIog6pnH1
— Press Trust of India (@PTI_News) November 24, 2025
సీజేఐ కుటుంబ నేపథ్యం
జస్టిస్ సూర్యకాంత్ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే, 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో ఆయన పుట్టారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత హిసార్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఈ తర్వాత పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో జడ్జిగా అనేక ప్రభావవంతమైన తీర్పులు ఇచ్చారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ నియమితులయ్యారు.
చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి
అపారమైన అనుభవం ఉన్న జస్టిస్ సూర్యకాంత్ పలు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చిన బెంచ్‌లలో సభ్యుడిగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. బ్రిటిష్ పాలనాకాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా భాగంగా ఉన్నారు. ప్రభుత్వం ఈ నిబంధనను పునఃపరిశీలించే వరకు, సెక్షన్ 124ఏ ఐపీసీ కింద కొత్త ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయవద్దంటూ రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించారు. పెగాసస్ స్పైవేర్ ఆరోపణలపై విచారణ జరిపిన ధర్మాసనంలో కూడా జస్టిస్ కాంత్ భాగంగా ఉన్నారు. జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వానికి స్వేచ్ఛా ఇవ్వలేమన్నారు.
Also Read: VC Sajjanar: మోసానికి గురైతే ఫిర్యాదు చేయమంటారు.. కంప్లైంట్ చేస్తే పట్టించుకోని వైనం!
ఓటు చోరీ వ్యవహారంపైనా..
బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పిటిషన్లపై విచారణలో కూడా భాగస్వామిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్, బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను వెల్లడించాలంటూ ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. అంతేకాదు, చట్టవిరుద్ధంగా పదవి నుంచి తొలగింపునకు గురైన ఓ మహిళా సర్పంచ్‌ను తిరిగి నియమించిన ధర్మాసనానికి ఆయనే నాయకత్వం వహించారు. ఈ కేసులో లింగ వివక్షను ఆయన ఎత్తిచూపారు. న్యాయవాద సంఘాలలో లింగ సమానత్వం కోసం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలోని సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని ఆయన ఆ తర్వాత ఆదేశించారు.
