Jamaat-ul-Mominaat: భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్ (JeM) తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు సైతం 10 మంది వరకూ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఉగ్రవాదులు సైతం మరణించారు. దీంతో భారత్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న మసూద్.. కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉగ్రవాదంలోకి మహిళలను దింపుతున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘జమాత్ – ఉల్ – మోమినాత్’ అనే విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జైషే మెుహమ్మద్ అధికారికంగా ప్రకటించింది.
మసూద్ సోదరి నాయకత్వంలో..
మసూద్ అజర్ నేతృత్వంలోని ఈ జైషే ఉగ్ర సంస్థ.. ఇప్పటివరకు మహిళలను యుద్ధం లేదా ఉగ్ర ఆపరేషన్లలో వినియోగించుకోలేదు. అయితే ఇక నుంచి బహావల్పూర్‌లోని మార్కజ్ ఉస్మాన్-ఓ-అలి కేంద్రంలో ఈ మహిళా విభాగం కోసం నియామకాలు ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. ఈ మహిళా విభాగానికి మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నాయకత్వం వహించనున్నారు. ఆమె భర్త యూసుఫ్ అజర్.. భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించడం గమనార్హం. అయితే భారత దాడిలో చనిపోయిన కమాండర్ల భార్యలను జమాత్ – ఉల్ – మోమినాత్ విభాగంలో నియమిస్తున్నారు. అలాగే ఆర్థికంగా వెనకబడిన స్త్రీలకు సైతం జైషే సంస్థ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆత్మాహుతి దాడుల కోసం ట్రైనింగ్..
అయితే ఐసిస్ (ISIS), బోకో హరామ్, హమాస్, ఎల్‌టీటీఈ (LTTE) వంటి ఉగ్ర సంస్థలు.. మహిళలను ఆత్మాహుతి దాడులకు ఉపయోగించిన చరిత్ర ఉంది. కానీ జైష్ – ఏ – మెుహమ్మద్, లష్కరే తోయిబా (LeT) వంటి సంస్థలు ఇప్పటివరకు మహిళలను యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొననివ్వలేదు. అయితే ఇప్పుడు జైషే కూడా మహిళా ఆత్మాహుతి బాంబర్లను వినియోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని మసూద్ అజర్ ఆయన సోదరుడు తల్హా అల్-సైఫ్ కలిసి తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ టార్గెట్‌గా..
‘జమాత్ – ఉల్ – మోమినాత్’ మహిళా విభాగాన్ని భారత్ లోనూ విస్తరించాలని జైషే భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్ తో పాటు దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు జైషే సన్నాహాలు చేస్తోంది. ఈ విభాగం ద్వారా.. మహిళలను మతపరమైన భావోద్వేగాలతో ఆకర్షించి ఉగ్రవాద కార్యకలాపాలు ఉపయోగించుకోవాలని జైషే భావిస్తోంది. పట్టణాలు, నగరాల్లోని చదువుకున్న ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకొని వారిలో భావోద్వేగాలు రగిలించాలని కుట్ర చేస్తోంది. అలా వారి చేత భారత్ లో ఆత్మాహుతి దాడులు జరిపి.. తీవ్ర ప్రాణనష్టం కలిగించాలని భావిస్తోంది.
Also Read: Qatar Airways: 85 ఏళ్ల శాకాహారికి.. నాన్ వెజ్ పెట్టిన విమాన సిబ్బంది.. తర్వాత జరిగింది ఇదే!
భారత్ పై జైషే జరిపిన దాడులు..
పాక్ ఉగ్రసంస్థ జైష్- ఏ- మెుహమ్మద్.. భారత్ పై గతంలో పలుమార్లు దాడులు జరిపింది. 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వెనుక ఈ ఉగ్ర సంస్థ హస్తం ఉంది. అయితే వాస్తవానికి 1994లోనే మసూద్ భారత్ లో అరెస్ట్ అయ్యాడు. కానీ IC-814 విమాన హైజాక్ తర్వాత అతడ్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సిందూర్ కారణంగా మసూద్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో తన అక్క, ఆమె భర్త, భార్య, మేనల్లుడు, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నట్లు మసూద్ అజర్ స్వయంగా ప్రకటించాడు.
