Arvind Kejriwal | భారత రాజకీయాలను గమనిస్తే ఓ ఆసక్తికర పరిణామం అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉండి జైలుకెళ్లిన నేతలు అందరూ బయటికొచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రులైన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, అంతకుముందు జగన్ ఇలా పలువురు నేతలు ఏవో ఆరోపణలతో జైలు జీవితం గడిపి ఆ తర్వాత సీఎం పీఠాన్ని అధిరోహించారు.
కానీ ఈ సెంటిమెంట్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కలిసి రాలేదు. రేవంత్, బాబు, జగన్ లు ప్రతిపక్షంలో ఉండగా చెరసాలకు వెళ్తే కేజ్రీవాల్ ఒక్కరే సీఎం హోదాలో వెళ్లారు. అంతేగాదు అక్కడి నుంచే కొంతకాలం పాలించారు కూడా. స్వతంత్ర భారత చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉండి అరెస్టై జైలుకెళ్లిన వ్యక్తిగా కూడ ఆయన చరిత్రకెక్కారు.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం తన పదవికి రాజీనామా చేసి ఆరు నెలలకు పైగా జైలులో ఉండి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి సీఎం అయ్యారు. అంతకుముందు తమిళనాడులో కరుణానిధి, జయలలితల విషయంలోనూ ఇదే జరిగింది. కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ ఆ సెంటిమెంట్ కు ఓటమితో బ్రేక్ పడింది.
రేవంత్ రెడ్డి, జగన్, చంద్రబాబు నాయుడుల అరెస్టులను కక్ష సాధింపు చర్యలని విశ్వసించిన జనం సానుభూతితో వాళ్లను గెలిపించారు. హేమంత్ సోరెన్ కు సైతం అదే కలిసొచ్చింది. అదే తరహాలో బీజేపీ తనను టార్గెట్ చేయడం కలిసి వస్తుందని కేజ్రీవాల్ ఊహించారు. ప్రజలు మరోలా ఆలోచించారు. ఫలితం భిన్నంగా వచ్చింది. చివరికి ఆయన ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయారు. దానికి తోడు ఆయనతో పాటు లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు కూడా ఓడిపోవడం కొసమెరుపు. దీన్ని బట్టి … అవినీతి వ్యతిరేక ఉద్యమాలకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ పై అవే అవినీతి ఆరోపణలు రావడం జనం సమర్థించలేదు.