Amitabh Kant: పనిగంటలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. యువత ఎన్ని గంటలు పనిచేస్తే దేశానికి మంచిదో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వారానికి 70 గంటలు పని చేస్తే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నీతి ఆయోగ్ మాజీ ఛైర్మన్ అమితాబ్ కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ల నుంచి 30 ట్రిలియన్లకు చేరాలంటే యువత ఎన్ని గంటలు పనిచేయాలో సూచించారు.
‘వారానికి 80-90 గంటలు పని చేయండి’
వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి ఎన్ని గంటలు కేటాయించాలన్న దానిపై యువతలో, సమాజంలో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంశంపై నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తనదైన శైలిలో పనిగంటలపై కొత్త నిర్వచనం చెప్పారు. కష్టపడి వర్క్ చేయడాన్ని తాను బలంగా నమ్ముతానని అమితాబ్ కాంత్ అన్నారు. వారానికి 80-90 గంటలైనా భారతీయులు కష్టించి పనిచేయాలని సూచించారు. అలాంటప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ల నుంచి 30 ట్రిలియన్లకు చేరుకుంటుందని అన్నారు.
Read Also: IND vs NZ: కివీస్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్!
‘నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’
నాణ్యమైన ఫలితాలను రాబట్టడంలో హార్డ్ వర్క్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అమితాబ్ కాంత్ తేల్చి చెప్పారు. అయితే కష్టపడకండా ఫలితం గురించి మాట్లాడటం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాషన్ గా మార్చుకోవద్దని యువతకు సూచించారు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు శ్రమించాలని హితవు పలికారు. 24 గంటల సమయంలో కొంత వ్యాయామానికి కేటాయించుకొని మిగిలిన దానిని వర్క్ – బ్యాలెన్స్ కోసం వినియోగించుకోవాలని అమితాబ్ కాంత్ అన్నారు.
ఆ మాటల దుమారంతో చర్చ మెుదలు..
ఉద్యోగుల పనిగంటలపై ఈ స్థాయిలో ప్రముఖులు చర్చ చేస్తుండటానికి ఓ కారణముంది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపాయి. ఇంట్లో కూర్చొని ఎంతకాలం భార్యను చూస్తూ ఉండిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. దానికి బదులు వారానికి 90 గంటలు ఆఫీసులో పనిచేయాలని సూచించారు. అవసరమైతే ఆదివారాలు కూడా వర్క్ చేయాలని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.