India Rich List: భారత్ లో ధనవంతుల సంఖ్య గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు ఓ అంతర్జాతీయ నివేదిక ప్రకటించింది. గ్లోబల్ ప్రొపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ (Knight Frank).. ది వెల్త్ రిపోర్ట్ 2025 పేరుతో తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశంలో 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారి సంఖ్య 2023తో పోలిస్తే 2024లో 6 శాతం మేర పెరిగింది. 2023లో 80,686 గా ఉన్న కోటీశ్వరుల సంఖ్య.. 2024కు వచ్చేసరికి 85,698 మందికి చేరింది. 2028కి వచ్చే సరికి 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్న వారి సంఖ్య 93,753 కు చేరవచ్చని తాజా రిపోర్ట్ అంచనా వేసింది.
అపర కుబేరులూ పెరిగారు..
కోటీశ్వరులతో పాటు అపర కుభేరుల సంఖ్య కూడా దేశంలో గణనీయంగా పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ (Knight Frank) రిపోర్ట్ వెల్లడించింది. దేశంలో బిలియనీర్స్ సంఖ్య 191 మందికి చేరుకున్నట్లు చెప్పింది. అయితే 2019లో భారత్ లో ఏడుగురు మాత్రమే బిలియనీర్స్ ఉండటం గమనార్హం. ఇక దేశంలోని అపరకుభేరుల మెుత్తం సంపద విలువ 950 బిలియన్ డాలర్లు (సుమారు రూ.82.61 లక్షల కోట్లు)గా ఉన్నట్లు తాజా రిపోర్టు వెల్లడించింది. అపర కుభేరుల సంపద జాబితాలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా (5.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (1.34 ట్రిలియన్ డాలర్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచినట్లు వివరించింది.
Also Read: DMK Councilor: మహిళతో డీఎంకే నేత అసభ్యకర ప్రవర్తన.. వీడియో వైరల్
కోటీశ్వరులు ఎలా పెరిగారంటే..
దేశంలో ధనవంతుల సంఖ్య పెరగడానికి గల కారణాలను గ్లోబల్ ప్రొపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ (Knight Frank) తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో వ్యాపార, పెట్టుబడి అవకాశాలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది. దేశంలో లగ్జరీ మార్కెట్ విలువ కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు చెప్పింది. ప్రపంచ సందప సృష్టిలో భారత్ తిరుగులేని దేశంగా అవతరించేందుకు వడి వడిగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.