Neet issue parliament
జాతీయం

NEET : పార్లమెంట్‌లో.. నీట్ ఫైట్

– నీట్‌పై చర్చకు విపక్షాల పట్టు
– పార్లమెంట్‌లో నినాదాలు, నిరసనలు
– ఉభయ సభలూ సోమవారానికి వాయిదా
– చర్చ జరగాల్సిందేనన్న రాహుల్ గాంధీ

INDIA bloc plans adjournment motions in both Houses of Parliament on NEET issue: దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరపాలని శుక్రవారం విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం అయింది. ఇటీవల మృతి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.

పట్టుబట్టిన ప్రతిపక్షాలు

స్పీకర్‌ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీట్‌ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. పేపర్‌ లీక్‌ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కోరారు. ఇందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలను ఉద్దేశించి “నేను ఇంతకుముందే చెప్పాను.. వీధుల్లో నిరసనలకు, సభలో జరిగే సమావేశాలకు మధ్య వ్యత్యాసం ఉండాలి” అని అన్నారు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

పెద్దల సభలోనూ గందరగోళం

రాజ్యసభలోనూ నీట్ అంశంపై రగడ జరిగింది రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ నేత సుధాన్షు త్రివేది చర్చను ప్రారంభించడంతో గందరగోళం నెలకొంది. పేపర్ లీకేజీలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు నినాదాలు చేశాయి. ఆందోళనల మధ్యే ఛైర్మన్ సభను నడిపించారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు పట్టువీడకపోడంతో ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్ఖర్ సభను మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో, వారి నిరసనల నడుమే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చను చేపట్టారు. ప్రతిపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. “పార్లమెంటు చరిత్రలోనే ఈ విధంగా రాష్ట్రపతి చర్చలో ఇతర అంశాలపై చర్చ జరగలేదు” అని గుర్తు చేశారు.

దేశ యువతకు సంబంధించిన కీలక అంశం

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నీట్‌ పేపర్‌ లీక్‌ సమస్య.. దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశం. దానిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోదీ చేపట్టాలి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంట్‌ ఇవ్వాలి’’ అని అన్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?