తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Kanche Gachibowli land Dispute: కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల్ని డెవలప్ చేసి విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తప్పుపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని ఆనుకుని ఉన్న ఈ భూముల విక్రయం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, విలువైన ఔషధ మొక్కల సంపద, అరుదైన పక్షి సంపద అంతరించిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం నిలిపివేసేలా జోక్యం చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో మంగళవారం ఉదయం మంత్రిని కలిసిన ఆరుగురు ఎంపీలు (రఘునందన్‌రావు, డీకే అరుణ మినహా) రాతపూర్వకంగా ఒక మెమొరాండంను అందజేశారు. పర్యావరణ ప్రాధాన్యత ఉన్న, హెరిటేజ్ సంపదతో తూలతూగుతున్న ఈ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ, సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని వివరించారు.
సుమారు 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతున్నదని, ఈ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్ల రూపాయలను ఆర్జించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కోరారు. యూనివర్శిటీ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.