Goa Fire Accident: నార్త్ గోవాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అర్పోరాలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ రెస్టారెంట్/ నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గోవాకు వచ్చిన పర్యాటకులు, క్లబ్ సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. 20 మందికి పైగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అర్పోరా ప్రాంతంలో పర్యాటకులు అధికంగా ఉండే ఈ లగ్జరీ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం సంభవించినది. ఆ సమయంలో క్లబ్‌లో పర్యాటకులు నిద్రిస్తుండటం వల్ల ప్రాణ నష్టం అధికంగా జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు, అయితే అప్పటికే భారీగా నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తీవ్ర దిగ్భ్రాంతి
ప్రధాని మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. కాగా, ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, హోటల్‌లో భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం ప్రకటించారు.
Also Read: Telangana Agriculture: సాగులో తెలంగాణ సరికొత్త రికార్డ్.. పంజాబ్‌ను దాటేసిన తెలంగాణ
అసలు కారణమిదే..
ఈ దుర్ఘటనపై అంజునా పోలీసులు సదరు క్లబ్ యజమానులు, భాగస్వాములు, మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సీఐ నవనీత్ గోల్టేకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. దీనిలో రోమియో లేన్ చైర్మన్ సౌరభ్ లూత్రా, ఆయన సోదరుడు గౌరవ్ లూత్రా సహా ఇతర మేనేజింగ్ సిబ్బందిని నిందితులుగా పేర్కొన్నారు. సరైన అగ్నిమాపక భద్రతా పరికరాలు, భద్రతా గాడ్జెట్‌లు అందుబాటులో లేకుండా నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. ఎఫ్‌ఐఆర్‌లో గమనించదగిన ముఖ్య అంశం ఏమిటంటే, రెస్టారెంట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు డెక్‌లోనూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం. అత్యవసర పరిస్థితుల్లో జనాన్ని ఖాళీ చేయించడానికి అనుమతించే మార్గం అందుబాటులో లేకపోవడం వల్లనే మృతుల సంఖ్య పెరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా, ఈ రెస్టారెంట్/క్లబ్‌కు సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేవని దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం ఘటనను ఎఫ్‌ఐఆర్‌లో మానవ తప్పిదంగా అధికారులు పేర్కొన్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని బట్టి, నిందితులపై బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్లు కింద అభియోగాలు మోపారు.
Also Read: Oppo Reno 15: త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న Oppo Reno 15.. ఫీచర్లు ఇవే!

