Telangana Agriculture: ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులకు ఆర్థిక భద్రత చేకూరింది. 2023–-24 సీజన్‌లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా 296.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2024–-25 సీజన్‌లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతోంది. గడిచిన రెండేండ్లలో తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించేలా పంటల సాగులో కొత్త రికార్డులు నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ను దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గతేడాది రూ.1,00,004 కోట్లు నమోదు కాగా.. 2024–-25 అంచనాల ప్రకారం రూ.1,06,708కు చేరింది.
ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా
తెలంగాణలో ప్రధాన పంటైన వరి 2023–-24లో 118.11 లక్ష్లల ఎకరాల్లో సాగు చేశారు. 2024-–25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి.. ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచింది. పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేండ్లు ఒకే తీరుగా ఉంది. 49 నిరుటితో పోలిస్తే ఈ ఏడాది పత్తి కప్పాల ఉత్పత్తి 3.89 లక్షల టన్నులు పెరిగింది. 26.35 లక్షల టన్నుల నుంచి 30.24 లక్షల టన్నులకు చేరింది. తొలి రెండేండ్లలోనే ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. రైతుల మేలుకోరే పథకాలకు భారీ బడ్జెట్ కేటాయించింది. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. రూ.54280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది. దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఒకే సారి రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది. దాదాపు 25 లక్షల (25,35,964) రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. తొలి ఏడాదిలోనే రూ. 20,616 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలులోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా ప్రజా ప్రభుత్వం కొనసాగించింది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు ప్రతి ఏడాది దాదాపు రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది.
Also Read: TV Premieres: ఈ రోజు టీవీలో ప్రసారం అయ్యే సూపర్ హిట్ సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి మరి..
రైతు భరోసా పంపిణీలోనూ రికార్డ్
రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతులకు పంటల పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీలోనూ రికార్డ్ వేగం నమోదు చేసింది. ఎకరానికి రూ.12 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ పంపిణీ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డు వేగంతో రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కేవలం 9 రోజుల్లోనే రూ.8744 కోట్లు జమ చేసింది.
రైతుకు బీమా ధీమా
రైతుకు ఆపద వస్తే రైతు కుటుంబాలు ధీమాగా ఉండేలా రైతు బీమాను ప్రభుత్వం అమలు చేసింది. ఇందులో భాగంగా రైతులు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్షల బీమా పరిహారం ఆ బాధిత కుటుంబానికి అందిస్తోంది. 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరిట ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి రైతు బీమా ప్రీమియం చెల్లించింది. గతంలో ఒక్కో రైతుకు రూ.3,400 చొప్పున చెల్లించిన ప్రీమియంను ప్రభుత్వం ఎల్ఐసీతో సంప్రదింపులు చేసి ఈసారి రూ.3225కు తగ్గించింది.
పంట నష్ట పరిహారం
ప్రకృతి విపత్తులతో, క్రిమికీటకాలతో పంటలు నష్టపోతే రైతులు ఇబ్బంది పడకుండా.. నష్ట పరిహారం అందేలా పంటల బీమాను పునరుద్ధరించింది. వ్యవసాయానికి సంబంధించి గత ప్రభుత్వం నిలిపి వేసిన 16 కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.
కట్టుదిట్టంగా ధాన్యం కొనుగోళ్లు
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను కట్టుదిట్టంగా నిర్వహించింది. గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు నెలకొల్పింది. రైతులు నెలల కొద్దీ ఎదురు చూడకుండా డబ్బులను వేగంగా చెల్లించి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత సీజన్లో 8,380 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 38.72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు (డిసెంబర్ 2వ తేదీ) దాదాపు రూ.10,162 కోట్ల ధాన్యం కొనుగోలు చేసింది. సెంటర్లలో ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తోంది.
Also Read: TGPSC Recruitment: రెండేళ్లలో ప్రభుత్వం 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఇవిగో లెక్కలు
సన్న వడ్లకు రూ.500 బోనస్
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు అమ్మిన రైతులకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లించింది. దీంతో రాష్ట్రంలో సన్నరకాల వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ఈ సీజన్లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది.
ధరణి వెబ్ పోర్టల్ రద్దు
గత ప్రభుత్వం హయంలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ధరణి వెబ్ పోర్టల్‌ను రద్దు చేసి.. రైతులకు తమ భూములపై హక్కులు కల్పించే భూ భారతి చట్టం అమల్లోకి తెచ్చింది. భూ భారతి కొత్త పోర్టల్‌తో భూముల సమస్యలు, వివాదాలు చాలావరకు పరిష్కారమయ్యాయి.
సూచనల కోసం రైతు నేస్తం
రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు, అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకునేందుకు రైతు నేస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రమంతా 1600 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్‌లను అమర్చనుంది. అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు ఉండేలా టీజీపీఎస్సీ ద్వారా 144 మంది వ్యవసాయ అధికారుల నియామకాలు చేపట్టింది. ఉద్యానవన శాఖలో 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్‌లను నియమించింది. ఆయిల్ పామ్ కస్టమ్స్ సుంకం సంబంధించిన సమస్యలు పరిష్కరించటం ద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకు 2000 అదనపు లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి సలహాలు, సూచనల కోసం కోదండరెడ్డి సారధ్యంలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసింది.
నాణ్యమైన విత్తనాలు అందించేందుకు…
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ సీడ్ యాక్ట్ ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే నెలలోనే ఈ బిల్లు ముసాయిదా తయారీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మెరుగైన విత్తనాలను పండించడం, స్థానికంగా అవసరం మేరకు వాడుకొని, మిగిలిన వాటిని ఎగుమతి చేసే స్థాయికి రైతులు ఎదిగేలా ఈ బిల్ ఉపయోగపడనుంది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెనుకాడలేదు. గత ఏడాది మార్చి, సెప్టెంబర్‌లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్‌లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36, 449 మంది రైతులకు రూ.44.19 కోట్ల పరిహారం అందించింది.
Also Read: Mark Thriller: కిచ్చ సుదీప్ ‘మార్క్’ ట్రైలర్ చూశారా?.. యాక్షన్ ధమాకా అదిరిపోయిందిగా..

