Chief election commissioner
జాతీయం

Chief election commissioner | కొత్త సీఈసీ జ్ఞానేష్ కుమార్

Chief election commissioner | న్యూఢిల్లీ, స్వేచ్ఛ: భారత ఎన్నికల సంఘం తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ (gnanesh kumar) ఎంపికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) సారధ్యంలోని త్రిసభ్య ఎంపిక కమిటీ సోమవారం ఖరారు చేసింది. ఎంపిక చేసిన కొత్త సీఈసీ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సీఈసీగా రాజీవ్ కుమార్ పదవీకాలం ఇవాళ్టితో (ఫిబ్రవరి 18) ముగిసిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమైంది. న్యూఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ప్యానెల్‌ సభ్యులుగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియపై దాఖలైన సవాళ్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఎంపిక భేటీని వాయిదా వేయాలంటూ రాహుల్ గాంధీ కోరినట్టు తెలిసింది. అయితే, ఆయన అసమ్మతిని తోసిపుచ్చి మరీ తదుపరి సీఈసీని కమిటీ ఎంపిక చేసింది. నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసింది. సీఈసీగా రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగిసిపోనుంది. ఆయనకు 65 సంవత్సరాలు నిండడంతో నిబంధనల ప్రకారం బాధ్యతల నుంచి దిగిపోతున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఈసీ జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎంపిక వాయిదా వేయండి

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆక్షేపిస్తోంది. ఎన్నికల సంఘంపై నియంత్రణ ఉండాలని కేంద్రం భావిస్తోందని, కానీ విశ్వసనీయతను మాత్రం గాలికి వదిలేసిందని మండిపడింది. సీఈసీ ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేసింది. ఈ బుధవారమే విచారణ జరగనుందని, అప్పటివరకు ఆగాలని పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మనుసింఘ్వీ డిమాండ్ చేశారు. సీఈసీ ఎంపిక కమిటీ భేటీకి రాహుల్ గాంధీ హాజరై వెళ్లిన కొద్దిసేపటికే అభిషేక్ మనుసింఘ్వీ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఈసీ సెలక్షన్ కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోందని ఆయన అన్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని అన్నారు. కాగా, సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి కేంద్ర హోంమంత్రిని సభ్యుడిగా చేర్చారు. ఈ విధానంలో ఎంపికైన తొలి సీఈసీ రాజీవ్ కుమార్ కావడం గమనార్హం.

ఎవరీ జ్ఞానేశ్వర్?

జ్ఞానేశ్వర్ కుమార్ ప్రస్తుత వయసు 61 సంవత్సరాలు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న సమయంలో, అంటే గతేడాది మార్చి నెలలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. కేరళ కేడర్‌కు చెందిన 1988వ బ్యాచ్ ఐఎస్ అధికారి. ఆగస్టు 2019లో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లు ముసాయిదా రూపకల్పన చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా (కశ్మీర్ డివిజన్), ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. విద్య విషయానికి వస్తే కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ ఫైనాన్స్‌ చదివారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆర్థిక శాస్త్రాన్ని కూడా ఆయన అభ్యసించారు. రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్‌లో ఇద్దరు కమిషనర్లు ఉండగా, జ్ఞానేశ్వర్ సీనియర్‌గా ఉన్నారు. అందుకే ఆయనను ఎంపిక చేశారు. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జ్ఞానేశ్వర్ పర్యవేక్షణలోనే జరగనున్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!