న్యూఢిల్లీ, స్వేచ్ఛ : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారిని స్వదేశాలకు పంపించివేస్తున్న క్రమంలో 104 మంది భారతీయ అక్రమ వలసదారులతో కూడిన ప్రత్యేక విమానం బుధవారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. సంకెళ్లు వేసి మరీ తరలిస్తున్నారంటూ విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ (Jaishankar) స్పందించారు. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్నవారిని స్వదేశాలకు తిరిగి పంపించివేయడం కొత్తేమీ కాదని అన్నారు. 2009 నుంచి ఈ తరహా బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని ప్రస్తావించారు. 2012 నుంచి విమానాల్లో తరలింపు విధానాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
చట్ట నిబంధల ప్రకారం సంకెళ్లు వేస్తున్నారని, మూత్రవిసర్జన సమయంలో సంకెళ్లను తొలగిస్తారని జైశంకర్ చెప్పారు. మిలిటరీ విమానాలు, చార్టర్డ్ ఫ్లైట్లలోనూ ఇలాగే వ్యవహరిస్తుంటారని చెప్పారు. మహిళలు, చిన్న పిల్లల విషయంలో నిర్బంధాలు లేవని ఐసీఈ అధికారులు సమాచారం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ఆహారం, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా సమకూర్చారని చెప్పారు. అక్రమ వలసదారుల తరలింపు కార్యక్రమాన్ని ఐసీఈ (అమెరికా కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అథారిటీ) అమలు చేస్తోందని ప్రస్తావించారు. అన్ని దేశాలవారిని అగ్రరాజ్యం వెనక్కి పంపిస్తోందని అన్నారు. అక్రమంగా నివసిస్తున్నారని తేలితే అన్ని దేశాలు తమ పౌరులను వెనక్కి తీసుకోవాల్సిందేనని, ఇది ప్రాథమిక బాధ్యత అని జై శంకర్ (Jaishankar) స్పష్టం చేశారు.
అక్రమ వలసదారుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ అమెరికాతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని జైశంకర్ వెల్లడించారు. తరలింపు సమయంలో వలసదారులకు ఎలాంటి అవాంఛిత ఘటనలు ఎదురవకుండా చర్చలు జరుపుతున్నట్టు వివరించారు. రాజ్యసభలో గురువారం ఈ ప్రకటన చేశారు. అక్రమ వలసలను నిరోధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నామని చెప్పారు. వలసల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతుండడం అత్యంత విచారకరమని అన్నారు. చట్టపరమైన వలసలను ప్రోత్సహించడం, అక్రమ వలసలను నిరోధానికి భారత్, అమెరికా మధ్య గతంలో నిర్ణయం జరిగిందని చెప్పారు.
చట్టబద్ధ వలసల కోసం వీసాల విధానాలను మరింత సులభతరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భారత్ తిరిగొచ్చిన వలసదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బాధ్యులైన ఏజెంట్లు, ఇతరులపై లాఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కఠినమైన చర్యలు తీసుకుంటాయని జై శంకర్ హెచ్చరించారు. అక్రమ వలసలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దారి తీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా వలస ఉండేవారిని చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోకి పాల్గొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, యూఎస్ హోమ్‌ల్యాండ్ విభాగం గణాంకాల ప్రకారం 20,407 మంది భారతీయులు సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్నట్టు గుర్తించారు. వీరిలో 17,940 మందిని తిరిగి వెనక్కి పంపించేందుకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే మొదటి విమానం బుధవారం భారత్ వచ్చింది.