– లద్దాక్‌లో వరద బీభత్సం
– కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకర్ టీ-72
– గల్లంతయిన ఐదుగురు సైనికులు
– చైనా సరిహద్దు సమీపంలో ఘటన
– రాజ్ నాథ్, రాహుల్ గాంధీ విచారం
Jammu Kashmir: చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గల్లంతయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యద్ధ ట్యాంకులతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్ మునిగిపోయింది. సరిగ్గా నది మధ్యలోకి యుద్ధ ట్యాంక్ రాగానే నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ట్యాంకర్‌లో ఉన్న ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో జూనియర్ కమిషన్డ్ అధికారి ఉన్నారు. వారికోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలను దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని ట్వీట్ చేశారు.