AirIndia-DGCA: ఎయిరిండియా విమాన ప్రమాదంపై (AirIndia Crash) పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (AirIndia-DGCA) సమగ్ర దర్యాప్తు జరుపుతున్న క్రమంలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టరింగ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎయిరిండియా అధికారులపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు కీలకమైన అధికారులను తొలగించాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. విమాన సిబ్బంది షెడ్యూల్ నిర్ణయించే కార్యకలాపాల్లో అలసత్వం వహించినందుకుగానూ డీజీసీఏ ఈ చర్యలకు ఉపక్రమించింది. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నప్పటికీ సిబ్బందిని షెడ్యూల్ చేయడం, నిబంధనలను పాటించకపోవడం, అంతర్గత వ్యవహారాలలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో సంబంధిత అధికారులపై ఈ చర్యలు తీసుకోవాలని ఎయిరిండియాకు ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియా స్వచ్చంధంగా వెల్లడించిన విషయాల ఆధారంగా అధికారులపై డీజీసీఏ చర్యలకు ఉపక్రమించింది.
చర్యలు వీరిపైనే
ఎయిరిండియా డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చూరా సింగ్, డీవోపీఎస్, క్రూ షెడ్యూలింగ్ చీఫ్ మేనేజర్ పింకీ మిట్టల్, సిబ్బంది షెడ్యూలింగ్, ప్లానింగ్ అధికారి పాయల్ అరోరాలపై తొలగింపు వేటు పడింది. విమాన లోపాల్ని పట్టించుకోకుండా ఈ అధికారులు అలసత్వం వహించారని డీజీసీఏ మండిపడింది. తప్పనిసరి అయిన లైసెన్సింగ్ నిబంధనల ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోలేదని వెల్లడించింది. ఆలస్యం చేయకుండా వీరిపై అంతర్గత క్రమశిక్షణా చర్యలు కచ్చితంగా తీసుకోవాలని ఆదేశించింది.
Read this- Special Railway Stations: దేశంలో టాప్-7 రైల్వే స్టేషన్లు.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!
రోస్టరింగ్ విధుల నుంచి తొలగింపు
ప్రోటోకాల్, భద్రత పర్యవేక్షణను షెడ్యూల్ చేయడంలో సదరు అధికారులు వ్యవస్థాగత వైఫల్యాలుకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ ముగ్గురు అధికారులను షెడ్యూలింగ్ రోస్టరింగ్‌కు సంబంధించిన అన్ని విధుల నుంచి తొలగించాలని మెస్సర్స్ ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది. నిందిత అధికారులపై అంతర్గత క్రమశిక్షణా చర్యలను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేసింది. తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏ కార్యాలయానికి నివేదించాలని ఆదేశించింది. షెడ్యూలింగ్ పద్ధతుల్లో దిద్దుబాటు సంస్కరణలు పూర్తయ్యేంత వరకు ముగ్గురు అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించాలని పేర్కొంది. తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు తొలగించిన అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని స్పష్టం చేసింది.
భవిష్యత్తులో ఏదైనా ఆడిటింగ్‌లో సిబ్బంది షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్ , విమాన సమయ పరిమితుల ఉల్లంఘనకు పాల్పడినట్టు తేలితే, జరిమానాలు, లైసెన్స్ సస్పెన్షన్ , ఆపరేటర్ అనుమతుల ఉపసంహరణ వంటి కఠినమైన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ హెచ్చరించింది. ఈ మేరకు డీజీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఫ్లైట్ స్టాండర్డ్స్ అధికారి హిమాన్షు శ్రీవాస్తవ ఆదేశాలు జారీ చేశారు.
Read this- Samantha: చైతూతో కలిసి ప్రమోషన్స్.. సమంత షాకింగ్ రియాక్షన్!