Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం, ఈసీకి వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో ఇండియా కూటమి (India alliance) తలపెట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక వాద్రా (Priyanka Gandhi Vadra) సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీసు స్టేషన్ కు తరలించారు. దీంతో దిల్లీలో హై టెన్షన్ నెలకొంది.
బారికేడ్లు దూకిన మాజీ సీఎం
కేంద్రంలోని అధికార బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపిస్తూ సోమవారం ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈసీ కార్యాలయం వరకూ వెళ్లాలని నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శివసేన నేత సంజయ్ రౌత్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రోడ్లపైకి వచ్చారు. అయితే ర్యాలీకి విపక్షాలు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఆరోపిస్తూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈసీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో బారికేడ్లు పెట్టి.. ఎంపీలను ముందుకు కదలనివ్వకుండా చేశారు. దీంతో విపక్ష ఎంపీలు అక్కడే బైఠాయించి.. బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు ఎంపీలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) బారికేడ్ల మీద నుంచి అవతలకు దూకడంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపుతప్పాయి.
ఇది రాజకీయ పోరాటం కాదు: రాహుల్
దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమికి చెందిన ఎంపీలను పోలీసులు బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. పోలీసులు తరలిస్తున్న క్రమంలో మీడియాతో రాహుల్ మాట్లాడుతూ ‘ఈ పోరాటం రాజకీయ పోరాటం కాదు. రాజ్యాంగాన్ని రక్షించడానికి. ఇది ఒక మనిషి, ఒక ఓటు కోసం జరిగే పోరాటం’ అని అన్నారు.
‘వారికి (కేంద్రం, ఈసీని ఉద్దేశిస్తూ) నిజం మాట్లాడే ధైర్యం లేదు. నిజం దేశం ముందు ఉంది’ అని రాహుల్ తెలిపారు. మరోవైపు దిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపక్ పురోహిత్ మాట్లాడుతూ.. నిరసనకు దిగిన నేతలను అదుపులోకి తీసుకున్నట్టు ధృవీకరించారు. అయితే ఎంతమంది ఉన్నారనే సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. ‘ఇండియా కూటమి నేతలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాం’ అని పురోహిత్ తెలిపారు.
పోలీసు అధికారులు ఏమన్నారంటే?
పురోహిత్ మాట్లాడుతూ ‘ప్రతిపక్షం ఈ స్థాయిలో నిరసన తెలిపేందుకు పోలీసు అనుమతి తీసుకోలేదు. కేవలం 30 మంది ఎంపీలు ఎన్నికల సంఘానికి వెళ్లి ఫిర్యాదు చేయడానికి మాత్రమే అనుమతించాం’ అని అన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేశ్ కుమార్ మహ్లా ప్రకారం ‘ఎన్నికల సంఘం 30 మంది ఎంపీలు తమ వద్దకు రావచ్చని చెప్పింది. కానీ 200 మందికి పైగా ర్యాలీకి వచ్చారు. చట్టం, శాంతిభద్రతలు కాపాడేందుకు వారిని ఆపాము. తరువాత వారిని అదుపులోకి తీసుకున్నాం. కొందరు బారికేడ్లపైకి ఎక్కి దాటేందుకు ప్రయత్నించారు’ అని దేవేశ్ కుమార్ తెలిపారు.
Also Read: SC on Delhi-NCR: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!
వివాదం ఏంటంటే?
విపక్ష కాంగ్రెస్ తో పాటు శివ్‌సేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) వర్గాలు.. ఎన్నికల సంఘం ఓటరు జాబితాను బీజేపీకి అనుకూలంగా మార్చిందని ఆరోపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల వ్యవధిలోనే భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గత వారం రాహుల్ గాంధీ దీనిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఓటర్ల జాబితాలో జరిగిన అవతవకలను నిర్ధారించే డేటాను బహిర్గతం చేశారు. ఎన్నికల సంఘం ఓటరు జాబితా డ్రాఫ్ట్‌ను సెర్చ్ చేయగలిగే రూపంలో మళ్లీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు త్వరలో ఎన్నికలకు వెళ్తున్న బిహార్ రాష్ట్రంలోనూ తాజాగా ఓటర్ల జాబితాను సవరించడం విపక్షాల అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి. మెుత్తంగా ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు.. యావత్ దేశంలో తీవ్ర చర్చకు దారితీశాయి.