Aravindk Kejriwal లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. తిహార్ జైలు నుంచి రేపు ఆయన బయటికి వచ్చే అవకాశం ఉన్నది. అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ తీర్పును ఢిల్లీ కోర్టు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇచ్చింది. బెయిల్ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు ఇంకా అందలేదు. రేపు ఉదయం ఆర్డర్ కాపీలు అందిస్తే కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వద్ద ఒక్క ఆధారం కూడా లేదని కేజ్రీవాల్ తరఫున న్యాయవాది కోర్టులో వాదించారు. కేవలం ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని తెలిపారు. తన క్లయింట్ నిర్దోషి అని, కాబట్టి, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.
ఈ బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయించిన తర్వాత కూడా బెయిల్ బాండ్ పై వారు సంతకం పెట్టడానికి కనీసం మరో 48 గంటల సమయం పెట్టాలని, ఆ గడువులో తాము ఈ బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేయడానికి సంబంధిత కోర్టును ఆశ్రయిస్తామని ఈడీ విజ్ఞప్తి చేసింది. కానీ, ఈడీ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో వెకేషన్ జడ్జీ న్యాయ్ బిందు తీర్పును వెలువరించారు.
తీర్పు వెలువడగానే ఢిల్లీలోని సీఎం నివాసం వద్ద ఆప్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ విడుదల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఇప్పటికీ ఈడీ స్టేట్‌మెంట్లు అన్నీ అవాస్తవాలేనని, కేజ్రీవాల్‌ను ట్రాప్ చేయడానికి తయారు చేసిన బూటకపు కేసు ఇది అని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో పలుమార్లు ఈడీ నోటీసులు పంపినా అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈడీ తనకు నోటీసులు చట్టబద్ధంగా పంపలేదని పేర్కొంటూ కేజ్రీవాల్ విచారణకు వెళ్లలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందు మార్చి 21వ తేదీన నాటకీయంగా కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకునే బాధ్యత తన మీద ఉన్నదని, ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు కోర్టు సమ్మతించింది. ఎన్నికల్లో ప్రచారపర్వం ముగిసిన తర్వాత జూన్ 2వ తేదీన ఆయన మళ్లీ జైలుకు వెళ్లిపోయారు.