Covid-19: భారత్‌లో మరోసారి అడుగుపెట్టిన కరోనా (Corona Virus) రక్కసి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇన్నాళ్లు పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు మాత్రం వేలకు వేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగించే విషయం. దీంతో మళ్లీ పాతరోజులు వస్తాయేమో? అనే ఆందోళన దేశ ప్రజల్లో నెలకొన్నది. భారతదేశంలో గత కొన్ని రోజులుగా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం క్రియాశీల కేసుల సంఖ్య జూన్ 11 నాటికి 7,121కి పెరిగింది. గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. ఈ సంవత్సరం మొత్తం మరణాల సంఖ్య 68 నుంచి 74కి చేరుకుంది. మే 2025 చివరి వారం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి. కేరళలో అత్యధిక కేసులు (2,223) నమోదవుతున్నాయి. గుజరాత్ (1223), ఢిల్లీ (757), పశ్చిమ బెంగాల్ (747), కర్ణాటక (436), మహారాష్ట్ర (595) తదితర రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 86 కేసులు, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Also- Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ.. ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు!
జాగ్రత్తలు తప్పనిసరి..
గత కొన్ని వారాలుగా కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. మే 2025 తర్వాత ఈ పెరుగుదల మరింత స్పష్టంగా ఉంది. కొత్తగా ఒమిక్రాన్ జేఎన్ 1 వేరియంట్‌లు, ముఖ్యంగా దాని సబ్-వేరియంట్‌లైన ఎల్ఎఫ్7, ఎక్స్‌ఎఫ్‌జీ కేరళలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ఎన్‌బీ1.8.1 వేరియంట్ కూడా కొన్ని ప్రాంతాల్లో గుర్తించబడింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్ల ప్రభావం సాధారణంగా స్వల్పంగానే ఉన్నప్పటికీ, వయసు మీద పడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై అధిక ప్రభావం చూపుతుండటంతో కొన్ని మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు వైద్య చికిత్స అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. మరోవైపు ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో మాస్క్‌లు ధరించాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే పలుమార్లు సూచించారు. కాగా, కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాకపోయినా, గతంలో ఉన్నంత తీవ్రమైన పరిస్థితి ప్రస్తుతం లేదు. అయితే, కేసుల సంఖ్య పెరుగుతున్నందున, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
టెస్ట్ ఉంటేనే అపాయింట్మెంట్!
దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిసే మంత్రులు, ఇతర అధికారులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. బుధవారం సాయంత్రం ఢిల్లీ బీజేపీ నేతలకు మోదీ ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయమే కరోనా టెస్ట్ తప్పనిసరి అని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ర్యాలీలో పాల్గొనే బీజేపీ శ్రేణులు కూడా తమ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఫలితాలను చూపించాల్సి ఉంటుంది. కాగా, ఈ నిబంధన కేవలం మంత్రులకే కాకుండా, ప్రధానితో వేదిక పంచుకునే అధికారులు, ప్రధాని పాల్గొనే ఇతర కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో ఉండే వారికి కూడా వర్తిస్తుంది. అంటే.. అధికారిక సమావేశాలు లేదా ఈవెంట్‌లలో పాల్గొనే ముందు, సంబంధిత అధికారులు ఈ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
Read Also- YS Jagan: ఇందిరమ్మతో వైఎస్ జగన్‌కు పోలికేంటి.. ఆశకు హద్దులేదా?