Centre on Ration: రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని సూచించింది. ఈ నెలాఖరు నాటికి లబ్దిదారులకు పంపిణీని పూర్తి చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
అయితే కేంద్రం అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకేసారి మూడు నెలలకు సంబంధించి రేషన్ ఇవ్వాలని కేంద్రం ఎందుకు ఆదేశించిందా? అని చర్చ జరుగుతోంది. భారత్ – పాక్ యుద్ధం సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన తర్వాత ఇక ఉద్రిక్తలు ఎక్కడవని మరికొందరు అనుమానిస్తున్నారు. మెుత్తానికి కరోనా సమయంలో మాత్రమే కేంద్రం ఇలా ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఇచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: Congress Leaders: కాంగ్రెస్‌లో రగడ.. రోడ్డెక్కిన నేతలు.. సవాళ్లు ప్రతి సవాళ్లు..
అయితే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయం ప్రకారం రేషన్‌కార్డుదారులకు మూడు నెలల రేషన్ అనగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఒకే సారి ఇవ్వనున్నారు. అంతేకాక ఎఫ్‌సీఐ గోదాముల్లో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆయా రీజియన్ల మేనేజర్లకు కేంద్రం సూచించింది.