10 Minute Delivery: వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల అనుసరిస్తున్న ‘10 నిమిషాల్లో డెలివరీ’ సర్వీసుపై (10 Minute Delivery) కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తరహా ప్రకటనలను మానుకోవాలని, వాటిని తొలగించాలని సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు స్పష్టం చేసింది. ఈ మేరకు బ్లింకిట్ వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమావేశమయ్యారు. డెలివరీ పార్ట్నర్స్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతినిధులను ఆయన కోరారు. స్టోర్ దగ్గరగా ఉండటం, టెక్నాలజీ తోడ్పాటుతో వేగంగా డెలివరీలు జరుగుతున్నాయని కంపెనీలు వాదించాయి. అయినప్పటికీ, టైమ్ లిమిట్స్ డెలివరీలు వర్కర్లపై మానసిక ఒత్తిడిని పెంచుతాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాతో పాటు ప్రకటనల నుంచి డెలివరీ సమయానికి సంబంధించిన హామీలను తీసివేస్తామని అన్ని కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. డెలివరీ టైమ్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనలపై మాట్లాడేందుకు జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టోతో పాటు పలు సంస్థల ఎగ్జిక్యూటివ్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బ్లింకిట్ కీలక నిర్ణయం!
కేంద్ర ప్రభుత్వ సూచనల నేపథ్యంలో బ్లింకిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్లాట్‌ఫామ్ ట్యాగ్‌లైన్ ఇప్పటివరు ‘10 నిమిషాల్లో 10,000 పైగా ఉత్పత్తుల డెలివరీ’ అని ఉండగా, దానిని ‘మీ ఇంటి వద్దకే 30,000 పైగా ఉత్పత్తుల డెలివరీ’ అని మార్చినట్లుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, గిగ్ వర్కర్ల అంటే డెలివరీ పార్ట్నర్స్ సేఫ్టీపై ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కాగా, డిసెంబర్ చివరి వారంలో వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డెలివరీ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించారు. తమ పని పరిస్థితులు, డెలివరీ టైమ్ తక్కువగా ఉండటంతో ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, తమకు ఎలాంటి సామాజిక భద్రత లేదంటూ నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిరసన తెలపడంతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. డెలివరీ సమయం, ఇతర ప్రమాణాల విషయంలో పునరాలోచించాలంటూ కంపెనీలకు సూచించారు.
త్వరగానే అందుతాయి.. కానీ, వేగంగా కాదు
బ్రాండింగ్ విషయంలో బ్లింకిట్ సంపూర్ణ మార్పులు చేయనుంది. ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు అన్నింటి నుంచి ‘10-నిమిషాల డెలివరీ’ అనే మాటను పూర్తిగా తొలగించనుంది. అయితే, ఈ మార్పు చేసినప్పటికీ డెలివరీలు త్వరగానే అందుతాయి. కానీ, మునుపటి అంత వేగంగా కాదు. కంపెనీలు బహిరంగంగా ఖచ్చితమైన సమయాన్ని హామీ ఇవ్వడాన్ని ఇకపై మానుకుంటాయి. దీంతో, డెలివరీ పార్టనర్లపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది. డెలివరీ ఒత్తిడి కారణంగా డెలివరీ పార్టనర్లు టెన్షన్‌లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలకు సైతం గురవ్వుతున్నారు. 10 నిమిషాల డెలివరీ షరత్తు ఎత్తివేస్తుండడంతో డెలివరీ పార్టనర్లకు కాస్త ఉపశమనం దక్కుతుంది.

