Indigo flight cuts: సవరించిన నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోకుండా అకస్మాత్తుగా వందల సంఖ్యలో విమానాలను రద్దు చేసి, ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగోపై (Indigo) కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉపక్రమించింది. సంస్థ రోజువారీ విమాన సర్వీసులను 10 శాతం మేర తగ్గించుకోవాలని (Indigo flight cuts) కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకోవాలన్న లక్ష్యంతో ఈ చర్య తీసుకుంది.
ఇండిగో విమాన సర్వీసులను 10 శాతం మేర తగ్గిస్తూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇండిగో సంస్థ కార్యకలాపాలను స్థిరీకరించడానికి, రద్దవుతున్న విమానాల సంఖ్యను తగ్గించడానికి వీలుగా, అన్ని రూట్లలో 10 శాతం మేర సర్వీసుల్లో కోత విధించడం అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ పరిమితిని పటిస్తూనే ఇండిగో సంస్థ గతంలో మాదిరిగానే అన్ని గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. టికెట్ ధరలపై పరిమితులు, ప్యాసింజర్లకు సౌకర్యాలు కల్పించే చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఆదేశాలను ఎటువంటి మినహాయింపు లేకుండా పాటించాలని ఇండిగోకు స్పష్టం చేశామని తెలిపారు.
ప్యాసింజర్ల వెతలు
గత వారం రోజులుగా ఇండిగో సంస్థ నిర్వహణ లోపం, విమాన షెడ్యూల్స్, సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు.
కాగా, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో పౌరవిమానయాన శాఖ మంగళవారం మరోసారి పిలుపించుకొని మాట్లాడింది. ప్రస్తుత పరిస్థితులపై తాజా సమాచారం కోరి, వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు, రీఫండ్ ప్రక్రియ 100 శాతం పూర్తయింది. డిసెంబర్ 6 వరకు రద్దయిన విమానాలకు సంబంధించిన 100 శాతం రీఫండ్‌లు పూర్తి చేసినట్లు సీఈఓ పీటర్ ఎల్బర్స్ ధృవీకరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
200 విమానాలు రద్దైనట్టే!
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో రోజుకు సుమారుగా 2,200 విమానాలను నడుపుతోంది. 10 శాతం కోత విధించడమంటే, రోజువారీగా 200లకు పైగా విమానాలు రద్దు అవుతాయని అంచనాగా ఉంది.

