అయోధ్య రామమందిర నిర్మాణ పునాదికి తొలి ఇటుక వేసిన బీజేపీ సీనియర్ నాయకుడు, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ (Kameshwar Choupal) కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన… శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కామేశ్వర్ మృతితో కుటుంబసభ్యుల్లో, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కామేశ్వర్ చౌపాల్ 24 ఏప్రిల్ 1956న బీహార్‌లోని సహర్సా జిల్లాలోని (ప్రస్తుత సుపాల్ జిల్లా) కమరైల్ గ్రామంలో జన్మించారు. వనవాసి కళ్యాణ్ కేంద్రం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, విద్యార్థి పరిషత్ వంటి సంస్థలతో కలిసి సామాజిక సేవకు తన సహకారం అందించారు. 1991లో బీజేపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అదే ఏడాది రోస్రా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 1995, 2000 ఎన్నికల్లో బఖ్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు.
మే 7, 2002న, కామేశ్వర్ చౌపాల్ (Kameshwar Choupal) బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వం తీసుకున్నారు. 2014 వరకు శాసన మండలి సభ్యునిగా కొనసాగారు. ఆయన అయోధ్య రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1989 నవంబర్ 9న రామమందిర నిర్మాణంలో తొలి శంకుస్థాపన చేసింది ఆయనే. అప్పుడే రామ మందిర నిర్మాణానికి కామేశ్వర్ చౌపాల్ మొదటి ఇటుకను వేశారు.
కామేశ్వర్ చౌపాల్ మృతికి ప్రధాని సంతాపం
కామేశ్వర్ చౌపాల్ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. బీజేపీ సీనియర్ నాయకుడు, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో విలువైన కృషి చేసిన రామభక్తుడు కామేశ్వర్ చౌపాల్. దళిత నేపథ్యం నుంచి వచ్చిన కామేశ్వర్ జీ సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ శోక సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సంబంధించిన మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!” అని మోదీ విచారం వ్యక్తం చేశారు.