ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అతిశీ (Atishi) ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వి.కే సక్సేనాకు ఆమె అందజేశారు. శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పదవికి ఆమె రాజీనామా చేశారు.
ఈ నెల 5న ఢిల్లీలో ఎన్నికలు జరగగా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఆప్ కి, బీజేపీకి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో కాషాయ పార్టీ విజయం సాధించింది. అదే సమయంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సహా కీలక నేతలైన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లాంటి వాళ్లకు పరాభవం తప్పలేదు. సీఎం అతిశీ మాత్రం కాల్ కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై ఆమె 3,521 ఓట్ల మెజార్టీని సాధించారు.
Also Read : VC Janardhan Rao | పారిశ్రామికవేత్త హత్య… 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు..
ఫలితాల అనంతరం స్పందించిన అతిశీ (Atishi)… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తమ పార్టీకి ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. బీజేపీ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన కాల్ కాజీ నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గతేడాది సెప్టెంబర్ లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అతిశీ ఆ పదవిని చేపట్టారు.