Amith Shah: దేశరాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోట దగ్గర గత నెలలో జరిగిన బాంబు పేలుడు ఘటన యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) కీలక విషయాలు వెల్లడించారు. ఈ బ్లాస్ కోసం 40 కేజీల పేలుడు పదార్థాలు వినియోగించారని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీ పేలుడు ఘటనలు సాధారణ పోలీసు దర్యాప్తులకు ఉదాహరణలు కాదని, అత్యంత పకడ్బంధీగా కొనసాగిన ఇన్వెస్టిగేషన్‌ను చాటిచెప్పే ఘటనలు అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవస్థీకృత నేరాలపై 360 డిగ్రీల కోణంలో దాడి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు దేశరాజధాని న్యూఢిల్లీలో యాంటీ-టెర్రరిజమ్ కాన్ఫరెన్స్-2025ను (Anti-Terrorism Conference 2025) ప్రారంభించి ప్రసంగించారు. ఈ తరహా కాన్ఫరెన్స్‌లు సెక్యూరిటీ వ్యవస్థల బలోపేతానికి ఉపయోగపడ్డాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు అద్భుత రీతిలో దర్యాప్తు చేశారని అమిత్ షా మెచ్చుకున్నారు. ఢిల్లీలో 40 కిలోల పేలుడు పదార్థాలతో పేలుడు సంభవించిందని, అయితే పేలకముందే మరో 3 టన్నుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోగలిగామని గుర్తుచేశారు. ఢిల్లీ పేలుడు జరగకముందే ఈ కుట్రలో పాల్గొన్న మొత్తం బృందాన్ని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఉగ్రవాదాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని, మోదీ విజన్‌లో భాగంగా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ తరహా కాన్ఫరెన్స్‌లు కీలక పాత్ర పోషించాయని అమిత్ షా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని నిరోధించాలంటే ముందస్తు ఆలోచన చాలా ముఖ్యమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేస్తున్న అధునాతన అనాలిసిస్ భద్రతా యంత్రాంగానికి సాయపడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ‘టీమ్ ఇండియా’ దృక్పథాన్ని బలోపేతం చేయడం, అన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన ఏటీఎస్ (ATS) నిర్మాణాన్ని రూపొందించడం నేటికాలానికి చాలా అవసరమని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
Read Also- Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఏంటీ స్పీడూ?
అన్ని రాష్ట్రాల డీజీపీలు వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా పోలీసులకు అత్యంత కీలకమైన సాధారణ ఏటీఎస్ (ATS) నిర్మాణాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. ఎన్ఐఏ అప్‌డేట్ చేసిన క్రైమ్ మాన్యువల్‌ను ఈ కార్యక్రమంలో అమిత్ షా విడుదల చేశారు. ఆయుధాల ఈ-డేటాబేస్ (e-database), వ్యవస్థీకృత నేరాల నెట్‌వర్క్‌లపై డేటాబేస్‌ను కూడా ప్రారంభించారు.
కాగా, ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితుల ఎన్ఐఏ కస్టడీని మరింత పొడగిస్తూ ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. దాడికి సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్ఐఏ అధికారులకు అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ అనుమతి ఇచ్చారు. నిందితుడు యాసిర్ అహ్మద్ దార్‌ను మరో పది రోజుల పాటు, సహ నిందితుడు డాక్టర్ బిలాల్ నసీర్ మల్లాను మరో 8 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ విచారణ ప్రక్రియను కవర్ చేయకుండా మీడియా ప్రతినిధులపై నిషేధం విధించారు. కాగా, నవంబర్ 10న ఎర్రకోట వద్ద పేలుడు జరగగా, 15 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

