Aadhaar PAN Link: ఆధార్–పాన్ లింకింగ్ విషయంలో ఇక ఆలస్యం చేయడానికి అవకాశం లేదని ఆదాయపు పన్ను శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేయడానికి డిసెంబర్ 31, 2025నే తుది గడువుగా నిర్ణయించారు. ఈ తేదీ తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్ (చెల్లని స్థితి)గా మారతాయి. దీంతో పన్ను సంబంధిత సేవలు, ఆర్థిక లావాదేవీల్లో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగింపులు ఇచ్చినప్పటికీ, ఈసారి మాత్రం ఇదే చివరి అవకాశం అని స్పస్టంగా చెప్పేసింది. నిర్ణీత తేదీలోపు ఆధార్–పాన్ లింక్ చేయని వారు ముఖ్యమైన ఆర్థిక సేవలను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఎవరు ఆధార్‌తో పాన్ లింక్ చేయాలి?
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ప్రత్యేకంగా మినహాయింపు పొందినవారు తప్ప మిగతా అన్ని పాన్ హోల్డర్లు ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఇప్పటివరకు లింక్ చేయని వారు ముందుగా రూ.1,000 ఆలస్య రుసుము (లేట్ ఫీ) చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
అయితే, ఇందులో ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. అక్టోబర్ 1, 2024 తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా పాన్ పొందిన వారు డిసెంబర్ 31, 2025 వరకు ఎటువంటి ఫీజు లేకుండా ఆధార్–పాన్ లింక్ చేసుకునే అవకాశం ఉంది. మిగతా వారందరికీ రూ.1,000 పెనాల్టీ వర్తిస్తుంది. గడువు ముగిసిన తర్వాత ఆధార్‌తో లింక్ కాని పాన్‌లు పని చేయకుండా పోతాయి. అప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు, బ్యాంక్ లావాదేవీలు, ఇతర ఫైనాన్షియల్ కార్యకలాపాల్లో పాన్ ఉపయోగించలేరు.
ఆధార్–పాన్ ఎలా లింక్ చేయాలి?
ఆధార్–పాన్ లింకింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తిచేయవచ్చు.
1. మొదట అధికారిక ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో ఉన్న ‘Quick Links’ విభాగంలో ‘Link Aadhaar’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
2. తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. మీ పాన్ ఇప్పటికే ఆధార్‌తో లింక్ అయి ఉంటే, సిస్టమ్ వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ చూపిస్తుంది.
Also Read: Medaram Temple: ప్రతి చిహ్నానికి ఆదివాసీ చరిత్రే ఆధారం.. నమస్తే తెలంగాణ కథనంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం!
3. లింక్ కాలేదంటే, ముందుగా రూ.1,000 పెనాల్టీ చెల్లించి ఉంటే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా పేమెంట్ వివరాలను వెరిఫై చేస్తుంది. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత లింకింగ్ రిక్వెస్ట్‌ను కొనసాగించవచ్చు.
4. చివరిగా, ఆధార్‌కు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఆరు అంకెల ఓటీపీని నమోదు చేసి కన్ఫర్మ్ చేయాలి. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తవడానికి 4–5 పని దినాలు పడుతుంది.
5. కావున, పాన్ హోల్డర్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోపు ఆధార్–పాన్ లింకింగ్ పూర్తి చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది.

