Tatkal Booking: పండగ సీజన్లలో రైల్వే టికెట్లు పొందాలంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అది కూడా తత్కాల్ టికెట్లు దక్కించుకోవాలంటే దాదాపుగా అసాధ్యమని చాలా మంది భావిస్తుంటారు. ఎందుకంటే రైలు ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ తత్కాల్ టికెట్స్ ను రైల్వే శాఖ ఓపెన్ చేస్తుంది. వీటి కోసం ఎంతగానో ఎదురుచూసే రైల్వే ప్రయాణికులు.. ఒక్కసారిగా బుకింగ్స్ కోసం ఆన్ లైన్ లో ఎగబడతారు. దీంతో హాట్ కేకుల్లా టికెట్స్ సేల్ అయిపోతుంటాయి. అయితే తత్కాల్ బుకింగ్స్ విషయంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తే.. టికెట్లను వెంటనే పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
రైళ్లల్లో తత్కాల్ కోటా ఎంత?
ప్రతీ రైలుకు తప్పనిసరిగా తత్కాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రైలు బయలుదేరడానికి సరిగ్గా ఒక రోజు ముందు రైల్వే శాఖ వీటిని ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొస్తుంది. సాధారణంగా రైళ్లలోని మెుత్తం సీట్లలో ఈ తత్కాల్ కోట 10-30 శాతంగా ఉంటుంది. అత్యవసరంగా ఊరికి ప్రయాణం కావాల్సిన వారు ఈ టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. అందుకే వీటికి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే బుకింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే అన్ని టికెట్లు అమ్ముడుపోతుంటాయి.
బుకింగ్ సమయం
తత్కాల్ టికెట్లను విడుదల చేసేందుకు రైల్వే అధికారులు నిర్ధిష్ట సమయాన్ని కేటాయించారు. ఏసీ క్లాసుల (1A, 2A, 3A, CC, EC) కోసం ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. అలాగే నాన్-ఏసీ క్లాసుల (స్లీపర్, 2S) కోసం బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయానికి లాగిన్ కాలేని పక్షంలో టికెట్ పొందడం దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే టికెట్లు అందుబాటులోకి వచ్చిన 5-10 నిమిషాల్లోనే టికెట్ల సేల్స్ కంప్లీట్ అయిపోతుంటాయి.
ఈ టిప్స్ పాటిస్తే.. టికెట్ మీదే!
తత్కాల్ టికెట్ విజయవంతంగా బుక్ చేయడానికి ముందస్తు సన్నద్దత చాలా ముఖ్యం. కాబట్టి ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా టికెట్ ను పొందే వీలు ఉంటుంది. ఇందుకోసం నిర్దేశిత సమయం కంటే ముందుగానే ఐఆర్ సీటీసీ యాప్ లేదా ఇండియన్ రైల్వే వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి. ప్రయాణ వివరాలు, ప్రయాణికుల సమాచారం సేవ్ చేసుకోవాలి. వేగవంతమైన చెల్లింపు పద్ధతులు (UPI, నెట్ బ్యాంకింగ్, ఈ-వాలెట్) ఉపయోగించాల్సి ఉంటుంది. టికెట్ కన్‌ఫర్మ్ అయిన వెంటనే చెల్లింపు పూర్తి చేయాలి. బ్రౌజర్ ఆటోఫిల్ అండ్ ఐఆర్‌సీటీసీ (IRCTC QuickBook) ఫీచర్ ఉపయోగించడం ద్వారా సమయం ఆదా అవుతుంది. ఈ టిప్స్ పాటించడం ద్వారా సెకన్ల వ్యవధిలోనే తత్కాల్ టికెట్లు పొందవచ్చు.
Also Read: Singareni Collieries: ఒడిశా నైనీ నుంచి తమిళనాడు జెన్ కోకు బొగ్గు.. 10 రోజుల్లో ఒప్పందం
తత్కాల్ టికెట్ ధరలు
తత్కాల్ టికెట్లు.. సాధారణ టికెట్ల కంటే ఖరీదైనవి. ఎందుకంటే ఇవి అత్యవసర సేవగా పరిగణించబడతాయి. ప్రీమియం తత్కాల్ టికెట్లు ఇంకా ఖరీదైనవి. వీటి ధరలు డైనమిక్ ప్రైసింగ్ ఆధారంగా మారుతుంటాయి. సాధారణ టికెట్ల కంటే తత్కాల్ టికెట్లు ధరలు 10% నుంచి 30% అధికంగా ఉంటాయి. వీటికి రిజర్వేషన్ ఫీజు అదనం.
