Breakfast: ప్రతీ ఉదయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు బ్రేక్‌ఫాస్ట్ వదిలేస్తారు. కొందరు బిజీ షెడ్యూల్ వల్ల, మరికొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఏం తినకుండా ఉంటారు. కానీ, నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఉదయం చేసే టిఫిన్ వదిలేయడం తేలికైన విషయం కాదు. ఇది శరీరంలో పోషక లోపాలు కలిగించి, రోగనిరోధక శక్తిని బలహీనపరచడమే కాకుండా డయాబెటిస్, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ వదిలేస్తే ఏమవుతుందో తెలుసా?
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే, ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో, శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు తీసుకునే అవకాశం తగ్గిపోతుంది. దీనివల్ల ఈ ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడుతుంది.
ప్రోటీన్: శరీర కండరాలకు, దృష్టి, శక్తికి అవసరం.
ఇనుము & విటమిన్ B12: రక్త కణాల తయారీకి, మెదడు పనితీరుకు కీలకం.
కాల్షియం & మాగ్నీషియం: ఎముకల బలానికి, హార్మోన్ సంతులనానికి, నరాల ఆరోగ్యానికి అవసరం.
ముఖ్యంగా మహిళల్లో ఈ లోపాల ప్రభావం కనపడుతుంది. అలసట, చిరాకు, దృష్టి లోపం వంటి సమస్యలు కలగవచ్చు.
రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆర్టెమిస్ హాస్పిటల్స్ డైటీటిక్స్ హెడ్ డాక్టర్ షబానా పర్వీన్ ప్రకారం, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ద్వారా పాలు, గుడ్లు, సీరియల్స్, పండ్ల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే పోషకాలు కూడా తగ్గినట్లే.
కాల్షియం: ఎముకల బలానికి ఉపయోగపడుతుంది.
విటమిన్ C & ఫోలేట్: రోగనిరోధక శక్తి, కణ పునరుద్ధరణకు సహాయపడుతుంది.
B విటమిన్లు: శక్తి, మెటాబాలిజం కోసం ఉపయోగపడతాయి.
అలాగే బ్రేక్‌ఫాస్ట్ ద్వారా లభించే ఫైబర్ జీర్ణక్రియకు సహకరిస్తుంది, ఆకలి ఎక్కువ కాలం ఉండకుండా నియంత్రిస్తుంది. కానీ బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే, మనం ఎక్కువగా అనారోగ్యకరమైన స్నాక్స్ తినే అవకాశం ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం
బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఎక్కువసేపు ఉపవాసంలాగా ఉంటే మధ్యాహ్నం సమయానికి రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పడిపోతుంది. దీంతో ఆకలి పెరిగి, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ లేదా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకునే అలవాటు ఏర్పడుతుంది. దీని వల్ల మూడ్ స్వింగ్‌లు, దృష్టి లోపం, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు
