Kavitha: కల్వకుంట్ల కవిత వేసే ప్రతి స్కెచ్‌లో ‘గులాబీ’ పార్టీ గిలగిలా కొట్టుకుంటుంది. ఆమె ఏ కార్యక్రమం చేపడితే దానికి కంటిన్యూగా బీఆర్ఎస్(BRS) కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేదిపోయి, కవితను ఫాలో అవుతుండటం అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. బీసీ రిజర్వేషన్లపై కవిత(Kavitha) ఉద్యమం ప్రారంభించిన తర్వాతనే బీఆర్ఎస్(BRS) సైతం కార్యక్రమాలు చేపడుతున్నది.
ఫాలో.. ఫాలో..!
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్(BRS) ప్రజా సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎంగడుతున్నది. అయితే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ కవిత(Kavitha) తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ అయినప్పటికీ జాగృతిపైనే దృష్టిసారించి ముందుకు అడుగులేస్తున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్యాయం అనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాలతో కారు పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించి పార్టీ సైతం కవిత(Kavitha) చేపట్టే కార్యక్రమాలను అనుసరించాల్సిన పరిస్ధితి వస్తున్న పరిస్థితి. ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా సరే, మళ్లీ బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో అదే కార్యక్రమం చేపడుతుండటం హాట్ టాపిక్ అయింది. కవిత(Kavitha) వైపు గులాబీ కేడర్ మొగ్గుచూపకుండా కట్టడి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు ప్రస్తుత కార్యక్రమాలతో స్పష్టమవుతోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యాల కన్నా కవితపైనే పార్టీ అధిష్టానం దృష్టిసారించినట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కవిత ప్రభావం పడకుండా చక్కదిద్దేపనిలో పడ్డారు.
Also Read: MLC Kavitha: కవిత కయ్యాలపై కీలక భేటీ.. జాగృతిపైనే ప్రధానంగా చర్చ!
అటు కవిత.. ఇటు బీఆర్ఎస్
కేసీఆర్(KCR)కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కవిత సీరియస్‌గా స్పందించారు. చావునోట్లో తలపెట్టిన తెలంగాణను సాధించిన గులాబీ బాస్‌కు నోటిసులివ్వడంపై బీఆర్ఎస్(BRS) నిరసనలు తెలుపకపోవడం, ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులపై వ్యతిరేకిస్తూ ఇందిరాపార్కులోని ధర్నా చౌక్‌లో జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. దీంతో బీఆర్ఎస్(BRS) సైతం అలర్టయింది. నోటీసులపై తీవ్రంగా స్పందించి ఖండించారు. ఆ తర్వాత కవిత(Kavitha) బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లపై పోరాట బాటపట్టారు. ఓవైపు జిల్లాల్లోనూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు రిజర్వేషన్ల సాధనకోసం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఓ వైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై గవర్నెన్స్ ఆర్డినెన్స్‌ను సమర్థిస్తూనే అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కవితకు క్రెడిట్ ఎక్కడ వెళ్తుందోనని అలర్టయిన బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం నిర్వహించింది. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ధర్నాను ఇందిరాపార్కు వద్ద నిర్వహించారు.
కవిత దారిలోకే..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆగస్టు 4 నుంచి 7 వరకు 72 గంటల నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో మళ్లీ బీఆర్ఎస్ అలర్టయి ఆగస్టు 8న కరీంనగర్‌లో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. బీసీ నేతలతో సభ అంశాన్ని పార్టీ ప్రకటింది. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో కవిత ఇరిగేషన్‌పై, భద్రాచలం ముంపు గ్రామాలపైనా రౌండుటేబుల్ సమావేశాలు నిర్వహించారు. దీంతో బీఆర్ఎస్ కూడా ఇరిగేషన్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో కరపత్రాలతో బనకచర్ల ప్రాజెక్టపై నష్టం గురించి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇలా వరుస కార్యక్రమాలు చూస్తుంటే ఎమ్మెల్సీ కవిత తన దారిలోకి బీఆర్ఎస్(BRS) రావాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తున్నాయి. ఆమె చేపట్టే ప్రతి కార్యక్రమానికి కంటిన్యూగా బీఆర్ఎస్ చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది.
యువతపై ఫోకస్
గత డిసెంబర్ నుంచి కవిత ప్రజల మధ్యలోకి వెళ్తూ, నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, రాజకీయంగా స్ట్రాంగ్ కాకుండా బీఆర్ఎస్(BRS) అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కవిత ఎక్కువగా యువతపై ఫోకస్ పెట్టి, భవిష్యత్‌ను దృష్ఠిలో పెట్టుకొని పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే లీడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే బీఆర్ఎస్(BRS) సైతం విద్యార్థి విభాగంను బలోపేతంపై దృష్టిసారించింది. పార్టీ ఏదైనా మంచి కార్యక్రమం తీసుకొని గ్రామస్థాయిలోకి వెళ్లకుండా కవిత చేపట్టే కార్యక్రమాలను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేయకుండా, విమర్శలు చేయడంతోనే కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్థానిక ఎన్నికల ముందు పార్టీ నిర్ణయాలతో క్యాడర్‌లో సైతం కొంత నైరాశ్యం నెలకొందనే సమాచారం. ఏదేమైనా కవితను బీఆర్ఎస్(BRS) అనుకరిస్తుండటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నది.
Also Read: MLC Kavitha: కవిత భేటీలపై రాజకీయ చర్చ.. ఎందుకిలా?