Congress: స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. మెదక్‌లో ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరగా త్వరలోనే మరో ఊహించని ఝలక్ తగలబోతోంది. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఊపిరిగా ఉన్న గాడిపల్లి భాస్కర్‌తో పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న భాస్కర్ సహా పలువురు కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు 100 మంది బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఎంపీ రఘునందన్ రావు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో చర్చలు జరిపారు. గజ్వేల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో స్థానిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుందని జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Read Also- Fish: చేపలు ఎన్ని రకాలు.. ఎలాంటివి తింటే ఆరోగ్యానికి మంచిది.. అసలెందుకు తినాలి?
నాడు కంచుకోట..
గజ్వేల్.. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ స్థానికంగా కోలుకోవడం కష్టంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కొంత మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆ పార్టీ అనుకున్నంత పురోగతి సాధించకపోవడంతో తిరిగి పలువురు నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ పట్టణంలో రాజకీయంగా గుర్తింపు పొందిన భాస్కర్ కాంగ్రెస్‌ను వీడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గజ్వేల్ తొలి మున్సిపల్ ఛైర్మన్‌గా గాడిపల్లి ఎంపిక అయ్యారు. ఆ తర్వాత గత ఎన్నికల సమయంలో బీజేపీలోకి మారి ఈటెల రాజేందర్‌ను గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిపి 65 వేల ఓట్లు సాధించడానికి కృషి చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి స్థానిక నాయకులతో సఖ్యత కుదరకపోవడంతో తిరిగి బీజేపీలోకి వెళ్తున్నట్లుగా భాస్కర్ ప్రకటన చేశారు.
నిత్యం ప్రజల్లో..
గాడిపల్లి భాస్కర్ రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. 2014లో గజ్వేల్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అంతకుముందు 2005లో టీడీపీ ఉమ్మడి జిల్లా బీసీ సెల్ అధ్యక్షులుగా పనిచేశారు. గజ్వేల్ పంచాయతీ సభ్యునిగా, ఎంపీపీ కో ఆప్షన్ సభ్యునిగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. గజ్వేల్‌లో ఎంపీటీసీగా ఆయన సతీమణి పనిచేశారు. 2010లో బీఆర్ఎస్‌లో చేరి టెలికం బోర్డు సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత గజ్వేల్ మున్సిపల్ ఛైర్మన్‌గా స్థానిక ముఖ్య నాయకులుగా చెలామణి అయ్యారు. ఇంకా గజ్వేల్ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా, చేనేత సహకార సంఘం సెక్రటరీగా, మహంకాళి టెంపుల్, రామాలయం కార్యదర్శిగా పనిచేస్తూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారన్న గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌లో తనకు తగిన గుర్తింపు లేదని, పైగా గ్రూపు రాజకీయాల వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందించకపోతున్నానని నిరాశతో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు భాస్కర్ పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలో పలువురు భూభాధితులు, ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాలనే తపనతో అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరానని కానీ ఆ పనులు పూర్తి చేయడానికి ఏలాంటి అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వందమందితో చేరిక..
గాడిపల్లి భాస్కర్ 9న ఎంపీ రఘునందన్ రావు నేతృత్వంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్, చారి, గజ్వేల్ నర్సింలు, నంగునూరు సత్యనారాయణలతో పాటు వివిధ కుల సంఘాల ముఖ్య నాయకులు కీలక కార్యకర్తలు భాస్కర్‌తో పాటు సుమారు 100 మంది చేరడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎంపీ రఘునందన్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుతో చర్చలు జరిపారు. గాడిపల్లి కాంగ్రెస్‌కు వీడుతుండటంతో స్థానిక రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకోనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన భాస్కర్.. ఈటల రాజేందర్‌ను గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దింపి 65 వేల ఓట్లు సాధించడం మామూలు విషయమేమీ కాదు. గతంలో అనేకసార్లు కూడా పలువురు నాయకుల గెలుపునకు భాస్కర్ కీలక పాత్ర పోషించారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న క్రమంలో భాస్కర్ బీజేపీలోకి మారడంతో ఆ పార్టీకి మేలు జరుగుతుందని స్థానికులు, విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also- Viral News: చొక్కా విప్పేసి.. నడిరోడ్డుపై పొలిటీషియన్ కొడుకు నిర్వాకం