Furniture Shop Fire: నాంపల్లి అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా అయిదుగురు మృత్యువాత పడ్డారు. ఆదివారం మృతదేహాలను కనుగొన్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బతికి ఉంటారన్న ఆశతో చివరి క్షణం వరకు ఎదురు చూసిన మృతుల కుటుంబీకులు మృతదేహాలను చూడగానే గుండెలవిసేలా రోదించటం ప్రతీ ఒక్కరిని కంట తడి పెట్టించింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదానికి కారణమైన బచ్చాస్ ఫర్నీచర్ షాపు యజమానిని ఆబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్లార్ లో ప్రమాదకరమైన రసాయనాలు, తేలికగా మండే స్వభావం ఉండే రెగ్జిన్, ఫర్నీచర్ మెటీరియల్ ను నిల్వ చేయటం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చెప్పారు. కాగా, దుర్ఘటనలో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించాలని నిర్ణయించింది. నాంపల్లి స్టేషన్ రోడ్డులోని హిందీ ప్రచార సభ భవనంలో నడుస్తున్న బచాస్ ఫర్నీచర్ షాపులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. పది ఫైరింజన్ల సాయంతో వందల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు శ్రమించినా మంటలు అదుపులోకి రాలేదు. సాయంత్రం 6.30గంటల సమయంలో అదుపులోకి వచ్చినట్టే వచ్చినా ఆ తరువాత మరోసారి మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరవాతే మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అయినా, ఆదివారం ఉదయం వరకు సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేక పోయారు.
అయిదుగురి దుర్మరణం..
ప్రమాదం జరిగినపుడు భవనం సెల్లార్ లో చిక్కుకుపోయిన అన్నదమ్ములు ప్రణీత్, అఖిల్ తోపాటు ఫర్నీచర్ సప్లై చేసే వాహన డ్రైవర్ సయ్యద్ హబీబ్, మహ్మద్ ఇంతియాజ్, బేబీ అనే మహిళ అగ్నికీలలకు ఆహుతయ్యారు. ఒక్కోచోట ఒక్కొక్కరి మృతదేహాలు లభ్యమైన నేపథ్యంలో సెల్లార్ నుంచి బయటకు రావటానికి వీళ్లందరూ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మెట్ల మార్గంలో మంటలు వ్యాపించటం…సెల్లార్ నుంచి పైకి రావటానికి ఉన్న ర్యాంప్ మీద ఓ షట్టర ఉండటం..దానికి తాళం వేసి ఉండటంతో ప్రాణాలు కాపాడుకోవటానికి వీళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఆదివారం మృతదేహాలను బయటకు తీసిన సహాయక సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం వాటిని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
అందుకే తీవ్రత పెరిగింది..
జరిగిన ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడారు. ఫర్నీచర్ షాపు నడుపుతున్న సతీష్ బచ్చా భవనం సెల్లార్ లోపల ఫర్నీచర్ తయారీకి ఉపయోగించే మెటీరియల్, రెగ్జిన్, కెమికల్స్ నిల్వ చేయటం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. వీటి కారణంగానే మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయని తెలిపారు. మెట్లపై కూడా మెటీరియల్ ను స్టోర్ చేసినట్టు చెప్పారు. ఎగిసిపడ్డ మంటలు వాటికి అంటుకోవటంతో మెట్ల మార్గం నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దాంతో సహాయక చర్యలను వేగంగా చేపట్టలేక పోయినట్టు చెప్పారు. కేవలం వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించాల్సిన సెల్లార్ ను గోడౌన్ లా మార్చటం…వాచ్ మెన్ తోపాటు మరికొందరు ఉండటానికి గదులు నిర్మించటం వల్లనే ప్రాణాలు పోయాయన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో రెండు వందల మందికి పైగా సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు. శనివారం రాత్రి మొత్తం లోపల చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం సిబ్బంది కష్టపడి పని చేశారన్నారు. ఆదివారం ఉదయం 9.15గంటల సమయంలో మొదటి మృతదేహం దొరికినట్టు తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ కారణమై ఉండవచ్చని చెప్పారు. విచారణ పూర్తయితే అసలు కారణం ఏమిటన్నది స్పష్టమవుతుందన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన హిందీ ప్రచార సభ భవన నిర్మాణ సమయంలో అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు.
Also Read: GHMC: కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా? చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో మరో కార్మికుడు మృతి!
5లక్షల చొప్పున ఆర్థిక సాయం
అగ్ని ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆర్థిక సహాయం ప్రకటించింది. చనిపోయిన ఒక్కొక్కరికి 5లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని వారి కుటుంబాలకు అందచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైందని ఆయన అన్నారు. ప్రమాదంలో అయిదుగురు చనిపోవటం బాధాకరమంటూ ఫర్నీచర్ షాపు యజమాని నిర్లక్ష్యమే దీనికి కారణమన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిగిన ప్రమాదంపై దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు సమన్వయాన్ని కుదుర్చుకుని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ పాటించని భవనాల గురించి తెలిసిన వారు సమాచారం
అందించాలని కోరారు.
షాపు యజమాని అరెస్ట్..
ఇక, ఫర్నీచర్ షాపు యజమాని సతీష్ బచాను ఆబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం సెల్లార్ ను వ్యాపార అవసరాల కోసం ఉపయోగించుకుని అయిదుగురి ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడన్న నేరారోపణల మీద ఆయనపై కేసులు నమోదు చేశారు.
Also Read: Minister Vakiti Srihari: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి..!

