Jubilee Hills Bypoll (imagecredit:twitter)
Politics, హైదరాబాద్

Jubilee Hills Bypoll: నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ప్రధాన పార్టీలకు చాలా కీలకం. దీంతో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. దీంతో ఉన్న కొద్ది సమయాన్ని వాడుకునేందుకు రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు, కుల సంఘాలతో ప్రధాన పార్టీల నేతలు భేటీ అవుతున్నారు. పార్టీల కీలక నేతలంతా యాక్టీవ్ కేడర్‌ను నియోజకవర్గంలో మోహరించి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధినే అస్త్రంగా మలుచుకోగా, బీఆర్ఎస్ సెంటిమెంట్‌ను నమ్ముకున్నది. ఈ రెండు పార్టీలను కాదని ప్రజల సైలెంట్ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నది.

మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

జూబ్లీహిల్స్‌పై మూడు ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఈ ఎన్నికలో సత్తా చాటితే రాబోయే కాలంలో ఏ ఎన్నికలు అయినా ఈజీ అవుతుందని భావిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, మున్సిపల్ ఎన్నికలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల అసెంబ్లీలకు ఉప ఎన్నికలు వచ్చినా వాటిలోనూ విజయం సాధించవచ్చని, జూబ్లీహిల్స్ వాటికి నాంది పలుకుతుందని భావిస్తున్నాయి. అంతేకాదు, పార్టీ గెలుపు కోసం డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన నేతల పనితీరుకు ఈ ఉప ఎన్నిక గీటురాయిగా మారనున్నది. ఆయా నేతల సమర్థతను బట్టి పార్టీలో పదవులతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లకు సైతం అర్హులుగా భావించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: Thummala Nageswara Rao: రైతుల సంక్షేమం కోసం నాబార్డు పని చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

విజయం సాధిస్తేనే రాజకీయ భవిష్యత్

మూడు పార్టీలు డివిజన్ల వారీగా, పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాయి. ప్రతి ఓటర్‌ను కలుస్తున్నాయి. ఓటర్లకు ఏయే అంశాలు వివరించాలి. వారికి ఏ హామీలు ఇవ్వాలి. వారిని పోలింగ్ బూత్‌ల వద్దకు ఎలా తీసుకురావాలి. పార్టీకి ఎలా ఓట్లు వేయించాలనే దానిపై వివరిస్తున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో ఎంతమందిని కలిశారు. వారి అభిప్రాయం ఎలా ఉందనే ఫీడ్ బ్యాక్‌ను సైతం సేకరిస్తున్నారు. ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ఎలా తీసుకురావాలనే అంశాలపై కసరత్తు చేయడంతో పాటు ప్రత్యేకంగా నేతలకు కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా వారితో సంప్రదింపులు సైతం జరిపినట్లు సమాచారం. ఈ ఎన్నిక కీలకం అని విజయం సాధిస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని పార్టీ అధిష్టానాలు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ప్రచారానికి చివరి రోజు కావడంతో మూడు పార్టీల సీనియర్ నేతలంతా జూబ్లీహిల్స్‌లోనే మకాం వేశారు. వారికి పార్టీలు టాస్క్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయా కులాలకు, వర్గాలకు చెందిన ప్రజలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి పనులు వివరిస్తున్నారు. తాము అండగా ఉంటామనే భరోసా కల్పిస్తున్నారు. అంతేకాదు నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారా? లేకుంటే కాలక్షేపం చేస్తున్నారా? వారి పనితనం ఎలా ఉంది? పార్టీలో ఉండి ఇతర పార్టీలకు ఏమైనా సపోర్టు చేస్తున్నారా? ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారనే అంశాలను సైతం పార్టీల పెద్దలు సేకరిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, వార్ రూంలను సైతం నిర్వహిస్తూ ప్రచార సరళిని సమీక్షిస్తూ ఇంకా ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారు.

పోలింగ్ తేదీ వరకు సైలెంట్ సర్వేలు

ప్రజల నాడిని బట్టి ముందుకు వెళ్లేందుకు ప్రైవేట్ సంస్థలతో పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆ సర్వేల ఆధారంగా నేతలను మానిటరింగ్ చేస్తున్నారు. పార్టీకి గ్రాఫ్ ఎక్కడ ఎక్కువగా ఉన్నది. ఎక్కడ తక్కువగా ఉన్నదని తెలుసుకొని నేతలను, కేడర్‌ను మోహరిస్తున్నారు. అక్కడ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆ డివిజన్ గానీ, ఆ కాలనీలో గాని ప్రజల అవసరాలను బట్టి హామీలకు తెర తీస్తున్నారు. అంతిమంగా గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. పోలింగ్ తేదీ వరకు సైలెంట్ సర్వేలు చేయించి ప్రచారం ముగిశాక కూడా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో ప్రణాళికలు రచించినట్టు సమాచారం. మొత్తంగా ఈ త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదోనని రాష్ట్ర ప్రజలంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ్టితో మైకులు బంద్ కానున్నాయి. ప్రచారానికి తెర పడుతుంది. 11వ తేదీన పోలింగ్, 14వ తేదీన ఫలితాల వెల్లడి ఉంటుంది.

Also Read: Abhishek Sharma: వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర నెలకొల్పిన అభిషేక్ శర్మ

Just In

01

Student death In US: ఛాతిలో నొప్పిని విస్మరించి.. అమెరికాలో ఏపీ యువతి మృతి

Komatireddy Venkat Reddy: చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు.. రూ.60,799 కోట్లతో తెలంగాణలో రోడ్ల శకం

Bellamkonda Suresh: ఇల్లు కబ్జా.. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి

Maganti Legacy Row: జూబ్లీహిల్స్ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మాగంటి గోపినాథ్ తల్లి, కొడుకు సంచలన వ్యాఖ్యలు