Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార ఘట్టం చివరిదశకు చేరుకుంది. నేటితో ఈ ప్రచార పర్వానికి ఎండ్ కార్డ్ పడనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ఈ ప్రచార పర్వం ముగియనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే సెగ్మెంట్ లో అన్ని డివిజన్లలో ప్రచారం చేయగా శుక్రవారం ఒక్కరోజే దాదాపుగా సెగ్మెంట్ లోని అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా ప్రచారంతో చుట్టేశారు. అయితే బీజేపీలో మాత్రం ప్రచార అంకం చివరికి చేరుకున్నా ఇంకా కోఆర్డినేషన్ లో సమస్యలు కనిపించాయి. ఒక ఎంపీ స్థాయి వ్యక్తికే అనూహ్య ఘటన ఎదురైంది. ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ లో ఆయన పేరున్నా.. దానికి సంబంధించిన సమాచారం ఆయనకు ఇవ్వకపోవడం సమన్వయ లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ప్రచార పర్వం నేటితో ముగియనుండంతో చివరి రోజైనా వారు సీరియస్ గా తీసుకుని పనిచేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
జాతీయ పార్టీకి బీహార్ ఎన్నికలు..
ఈ ఉప ఎన్నికల్లో ఇతర పార్టీలతో పోలిస్తే.. బీజేపీ ప్రచారంలో వెనుకబడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అభ్యర్థి ప్రకటన మొదలు అన్నీ ఆలస్యంగానే ప్రారంభించడంతో అనుకున్న స్థాయిలో ఓటర్లను చేరుకోవడంలో వెనుకంజలో ఉందని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు జాతీయ పార్టీ పెద్దలు ఎవరూ రాకపోవడంతో, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. జాతీయ పార్టీకి బీహార్ ఎన్నికలు కీలకం కావడంతో వారంతా అక్కడికే పరిమితమయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా దీన్ని చిన్న ఎన్నికగానే చెప్పారు. తమకు బీహారే కీలకమని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఎలక్షన్ ను బీజేపీ లైట్ తీసుకుందనేందుకు బలాన్ని చేకూర్చినట్లయింది. ఈ తరుణంలో 11న జరిగే పోలింగ్ ప్రక్రియలో బీజేపీకి ఎంతమంది ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: The Family Man S3 Trailer: మనోజ్ బాజ్‌పాయ్ నట విశ్వరూపం.. ఈసారి దానిపైనే ఫోకస్!
సర్వే చేసిన సంస్థల్లో..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాము గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తంచేస్తోంది. కాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ సర్వే చూసినా కమలదళం మూడో స్థానంలోనే ఉండటం గమనార్హం. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అని చెబుతున్నా.. ఈ బ్యాలెట్ ఫైట్ లో కాషాయ పార్టీ లేదని సర్వేలు చెబుతున్నాయి. కాగా సర్వేలను తాము పట్టించుకోబోమని బీజేపీ నేతలు చెబుతున్నారు. సర్వే చేసిన సంస్థల్లో ఒక్క దానికి కూడా చెప్పుకోదగిన స్థాయి లేదని చెబుతున్నారు. గతంలో కూడా ఇలాగే ఓడిపోతామని సర్వేలు చెప్పాయని, అయినా ఆ ఎన్నికల్లో గెలిచామని ఉదాహరణలను చూపుతున్నారు. కాగా బీజేపీ కనీసం డిపాజిట్ అయినా దక్కించుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్.. సవాల్ విసురుతున్నాయి. ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటే తెలంగాణ బీజేపీ నేతలకు సన్మానం చేస్తామని చెప్పుకొచ్చారు. టీబీజేపీ నేతలు గొప్పోళ్లని ఒప్పుకుంటానని వెల్లడించారు. ప్రచారానికి మిగిలిన చివరి రోజును అయినా కాషాయ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
