GHMC: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీ సిటీలోని కోటిన్నర మంది జనాభాకు అందించే పౌర, అత్యవసర సేవలు, అభివృద్దికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ ఈ నెల 29వ తేదీన సమావేశం కానున్నట్లు సమాచారం. వచ్చే నెల 10వ తేదీతో ప్రస్తుత పాలక మండలి అధికార గడువు ముగియనున్నందున ఇదే చిట్ట చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నాం జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జరగనున్న ఈ స్టాండింగ్ కమిటీలో దాదాపు రూ. వేల కోట్ల పనులకు కమిటీ మంజూరీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందులో రోడ్ల మెరుగైన నిర్వహణ కోసం కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ )ఫేజ్- 2 కింద రూ 3,145 కోట్ల నిధులతో రోడ్ల మెయింటెనెన్స్, రీ-కార్పెటింగ్, రీ-లేయింగ్ పనులకు పరిపాలనా అనుమతులు కోరుతూ అధికారులు ప్రతిపాదనలను కమిటీ ముందు పెట్టనున్నారు. అధికారుల ప్రతిపాదనల ప్రకారం ఫేజ్-1 లో కవర్ కాని రోడ్లకు మరోసారి బీటీ, సీసీ పనులను ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో మెరుగైన నిర్వహణను చేపట్టనున్నారు. వీటితో పాటు నగర వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, పార్కులు, చెరువుల అభివృద్ధి, సివిల్ వర్క్స్, సీఎస్ఆర్ ప్రాజెక్టులు, మౌలిక వసతుల నిర్మాణాలకు సంబంధించిన 45 అంశాలతో అధికారులు రూపొందించిన అజెండా గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుకు రానుంది. వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు, ప్రభుత్వ అనుమతి ప్రతిపాదనలు, టెండర్ ప్రక్రియలకు గ్రీన్ సిగ్నల్ కోరుతూ ప్రతిపాదనలు కమిటీ ముందకు రానున్నట్లు తెలిసింది.
ప్రధాన ప్రతిపాదనలు ఇవే..
ఈ స్టాండింగ్ కమిటీ సమవేశంలో మేజర్ రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అబివృద్ధిలో భాగంగా మసీదు బండా నుంచి బోటానికల్ గార్డెన్ రోడ్ వరకు 120 అడుగుల రోడ్డు అభివృద్ధికి రూ. 5.98 కోట్లతో రూపకల్పన చేసిన ప్రతిపాదనలతో పాటు ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి, గోల్కొండ(Golkonda), ఉప్పల్(Uppal) జోన్లలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలు, సీఆర్ఎంపీ కింద బీటీ, సీసీ రోడ్లకు రూ. 2230 కోట్లు, అదనపు సీసీ రోడ్ల కోసం రూ. 208 కోట్లు, ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో బీటీ రోడ్లకు రూ. 707 కోట్ల చొప్పున మొత్తం రోడ్ల అభివృద్ధి రూ.3145 కోట్లకు పెంచుతూ ప్రతిపాదనలను సిద్దం చేశారు. ఇక డ్రైనేజ్, వరద నియంత్రణ ప్రాజెక్టులు (ఎస్ఎన్‌డీపీ) కోసం అఫ్జల్ సాగర్ నాలా రీమోడలింగ్ కోసం రూ. 5.90 కోట్లు, చత్రినాకా క్రాస్ రోడ్ నుంచి తాలాబ్‌కట్ట వరకు నాలా అభివృద్ధికి రూ. 47.49 కోట్లు, శివాజీ నగర్ నుంచి చత్రినాకా వరకు బాక్స్ డ్రైన్ రూ.4.70 కోట్లు, నాదమి చెరువు (సఫిల్‌గూడ) అభివృద్ధి పనుల కోసం రూ. 2.04 కోట్లు, స్పోర్ట్స్ , పబ్లిక్ స్పేసెస్ కోసం బండ్లగూడలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూ. 4.20 కోట్లు, వల్వార్ నగర్ (ఉప్పల్)లో ఫుట్‌బాల్ గ్రౌండ్ అభివృద్ధి రూ. 3.20 కోట్లు, సీఎస్ఆర్ ప్రాజెక్టుల కోసం హఫీజ్‌పేటలో స్క్వేర్ బ్యూటిఫికేషన్, అఖిల భారతీయ మహిళా పరిషత్ ద్వారా అభివృద్ధి సోమాజిగూడ గ్రీనరీ డెవలప్‌మెంట్ , సురేంద్ర పార్క్ హోటల్స్ సీఎస్ఆర్ తార్నాకా మోడల్ మార్కెట్ భవనాన్ని లైట్ హౌజ్ కమ్యూనిటీ ఫౌండేషన్‌కు శిక్షణ కేంద్రంగా అప్పగించే ప్రతిపాదన కూడా కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది.
Also Read; TPCC: టీపీసీసీ కీలక నియామకాలు.. ఉత్తర్వులు జారీ చేసిన మహేష్ కుమార్ గౌడ్
చవరి రోజుల్లో ఉద్యోగులకు నజరానా
పాలకమండలి గడువు ముగుస్తున్నందున ఉద్యోగులకు నజరానా ప్రకటించాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఉద్యోగుల డీఏను 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచేందుకు ప్రతిపాదన సిద్దం చేసినట్లు తెలిసింది. 2023 నుంచి పెండింగ్ బకాయిలు 30 నెలల వాయిదాల్లో చెల్లింపు, హెల్త్ అసిస్టెంట్ల ప్రమోషన్లు, మెకానిక్ పోస్టుకు సర్వీస్ కన్వర్షన్ నియామకం, జీఐఎస్ ప్రాజెక్టుల కోసం కన్సల్టెంట్ నియామకానికి ఆర్ఎఫ్‌పీ అనుమతిని కోరుతూ కూడా ప్రతిపాదన కమిటీ ముందుకు రానున్నట్లు సమాచారం.
Also Read: HYDRAA: సంకల్పం దిశగా హైడ్రా అడుగులు.. ఒక్క ఫిర్యాదుతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం

