HYDRAA: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలతో పాటు నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా సంకల్పం దిశగా అడుగులు వేస్తున్నట్లు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. కేవలం సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలే గాక, దశాబ్దాల క్రితం వేసిన లే ఔట్లలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలను కూడా హైడ్రా కబ్జా నుంచి విముక్తి కల్గిస్తుంది. హైదరాబాద్ మహానగర ఆస్తులు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయమని, రూ. వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు నగర సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఆయువు పట్టు లైన చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోందని, ఆ క్రమంలో మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పని చేస్తున్న పలువురు ఇంజనీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకోగా సమయస్పూర్తిగా రంగంలోకి దిగి, వారి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా మంగళవారం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఎలాంటి వత్తిళ్లకు గురి కాకుండా ముక్కు సూటింగా యాక్షన్ లోకి దిగి, మహానగర ప్రజలచే భేష్ అన్పించుకుంటుంది. పార్కులు, రహదారుల కబ్జాలకు సంబంధించి బాధితులు, బాధ్యతాయుతమైన పౌరులు సంబంధించి ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదులు చేసినా పరిష్కారానికి నోచుకోని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఒక్క ఫిర్యాదుతోనే హైడ్రా పరిష్కరించటం విశేషం. తొలుత ఫిర్యాదులోని అంశాలు వాస్తవమేనా? అన్న విషయాన్ని టెక్నికల్ గా నిర్థారించుకున్న తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, కబ్జాలకు బాధ్యులైన వారికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వారు ఊహించని స్థాయిలో యాక్షన్ చేపట్టడం హైడ్రా స్పెషాల్టీ.
ఇప్పటి వరకు రూ.65 వేల కోట్ల భూముల పరిరక్షణ
2023 జూలై 29న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఏర్పాటైన హైడ్రా ఇప్పటివరకు సుమారు 1,350 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ భూముల విలువ సుమారు రూ.65 వేల కోట్ల పై చిలుకు ఉంటుందన్న అంఛనాలున్నాయి. కేవలం సర్కారు ఆస్తుల పరిరక్షణే కాకుండా పకృతి వైపరీత్యాలు సంభవించినపుడు కూడా నేను సైతం అంటూ హైడ్రా విపత్తుల నివారణలో తనవంతు బాధ్యతలను నిర్వహిస్తుంది. గత వర్షాకాలంలో తరుచూ చెరువును తలపించే వర్షపు నీరు నిలుస్తున్న అమీర్ పేట మైత్రి వనం వద్ద దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ సమకూర్చని శాశ్వత పరిష్కారాన్ని హైడ్రా సమకూర్చటం పట్ల వరద నీటి నిల్వతో ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారుల ప్రశంసలకు నోచుకుంది. ముఖ్యంగా అంబర్ పేటలోని బతుకమ్మ కుంట ఆనవాళ్లను తెల్సుకుని, కుంటను కాపాడటంతో పాటు కుంటకు జీవనం పోసి, పూర్వవైభవాన్ని సంతరింపజేసిన హైడ్రా అంతటితో ఆగకుండా గత దసరా పండుగ సందర్భంగా కుంటను బతుకమ్మ ఆట పాటకు వేదికగా రూపొందించింది.
Also Read: Ajit Pawar Death: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం.. శోక సంద్రంలో రాజకీయ ప్రముఖులు!
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా..
చక్కటి, ఆహ్లాదరకమైన వాతావరణం, పార్కు, వాకింగ్ ట్రాక్,వయోవృద్దులకు సిట్టింగ్ సౌకర్యాలు వంటి వాటితో పునరుద్దరించుకున్న బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పున ప్రారంభించిన హైడ్రా సిటీలోని అన్ని వర్గాల ప్రజల ఆదరణకు నోచుకుంది. అంతటితో ఆగని హైడ్రా ఈ ఏటా ఆరు చెరువులకు, వచ్చే ఏడాది మరో 14 చెరువులను పునరుద్దరించేందుకు సిద్దమైంది. పాతబస్తీలోని భమృక్ ఉన్ ఉద్దౌలా చెరువును పునరద్దరించే పనులను కూడా తుది దశకు తీసుకువచ్చింది. మందుస్తు చర్యలతో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నగరాన్ని తీర్చిదిద్దటంలో హైడ్రా తనవంత పాత్ర పోషిస్తుంది. సర్కారు ఆస్తుల పరిరక్షణతో ఆగని హైడ్రా రోడ్లను ఆక్రమించుకుని, పేదలను చిన్న చూపు చూస్తున్న వ్యవహారాలను సైతం మానవతా ధృక్పతంతో డీల్ చేసిన హైడ్రా ఎన్నో నివాసాలకు ఏళ్లుగా మూసుకుపొయిన రహదార్లను తెరిపించింది. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని తాజ్ ఫలక్ నుమా వేదికగా ది గ్రేట్ ఇంటిగ్రేషన్: టెక్నాలజీ, టాలెంట్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ఆసియా” అనే అంశంపై స్పీకిన్ ఆసియా డైలాగ్స్ ఫోరం – 2026 నిర్వహించిన సమావేశంలో ఐటీ, విద్యా సంస్థలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరై హైడ్రా కార్యకలాపాల పట్ల ఎంతో ఆసక్తిని కనబర్చటంతో పాటు పర్యావరణ పరిరక్షణతో పాటు వరదల నివారణకు హైడా చేస్తున్న కృషిని అభినందించిన సంగతి తెల్సిందే.
ప్రజావాణి ఫిర్యాదులపై స్పెషల్ ఫోకస్
కొద్ది నెలల క్రితం నుంచి హైడ్రా ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను, విన్నపాలను స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. హైడ్రాకు ప్రస్తుతం ప్రజల నుంచి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో నూటికి తొంభై శాతం ఫిర్యాదులు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, పోలీసు ఇతరాత్ర సర్కారు శాఖలకు గతంలో సమర్పించినవే ఉన్నాయి. ఫిర్యాదులు చేసిన తర్వాత దశాబ్దాలుగా ఆయా శాఖల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, పరిష్కారం కాని సమస్యలు ఒక్క ఫిర్యాదుతో హైడ్రా పరిష్కరించినవి ఎన్నో ఉన్నాయి. ఫిర్యాదు స్వీకరించే సమయంలోనే ఫిర్యాదుదారుడి ఉద్దేశ్యం, ఫిర్యాదులోని అంశాలను స్కానింగ్ చేసే హైడ్రా పరిష్కారానికి ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుని, గతంలో ఏ శాఖ చేపట్టని స్థాయిలో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి, కబ్జాలు అయినట్లు, రహదారులను మూసివేసినట్లు టెక్నికల్ గా నిర్థారించుకున్న తర్వాత యాక్షన్ లోకి దిగుతూ హైడ్రా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణను పొందిందని చెప్పవచ్చు. కొందరు బడా బాబులు సర్కారు భూములను ఆక్రమించి, కోర్టు వివాదాలను సాకుగా చెబుతూ తమ అక్రమాలను కొనసాగిస్తున్న వారి గుండల్లో సైతం హడ్రా రైళ్లు పరిగెత్తించిన సందర్భాలెన్నో ఉన్నాయి. గాజుల రామారంలో వందలాది ఎకరాల భూమిని కాపడటంతో కొందరు పేదల తాత్కాలిక నివాసాలు తొలగించాల్సి వచ్చినా, అలాంటి వారు తమను ఆశ్రయిస్తే వారి పునరావాసానికి తగిన సహాయం చేస్తామని కూడా హైడ్రా కమిషనర్ రంగనాధ్ వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. ఈ ఆక్రమణల తొలగించే సమయంలో పేదలను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు తమ పబ్బం గడుపుకుంటున్నట్లు గుర్తించిన హైడ్రా నిరాశ్రయులకు తనవంతు బాధ్యతగా అండగా ఉండాలని కూడా నిర్ణయించుకుంది.
Also Read: David Reddy: మంచు మనోజ్ లుక్ను ఇలా ట్రోల్ చేస్తున్నారేంట్రా.. కాస్త చూసుకోబడలా?

