BJP Telangana: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు కాషాయ పార్టీ సమాయత్తం అవుతున్నది. సర్పంచ్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే కాస్తో కూస్తో బెటరేననిపించుకున్న కమలం పార్టీ త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై కన్నేసింది. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో మున్సిపల్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కసరత్తును ముమ్మరం చేయాలని నిర్ణయించుకుంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్లతో రాష్ట్ర స్థాయి బూత్ నిర్మాణ్ అభియాన్ వర్క్ షాప్‌తో పాటు పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. కాగా, ఇందుకు సంబంధించిన అంశాలపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత రాష్ట్ర ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ తివారి, ఆఫీస్ బేరర్లకు దిశానిర్దేశం చేశారు.
తాజా రాజకీయ పరిస్థితులపై చర్ఛ
రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ నేతలు చర్చించారు. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని కమలదళం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలుస్తున్నది. బూత్ స్వస్థీకరణపైనా సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు మంగళవారం నుంచే ప్రజల్లోకి వెళ్లేలా పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు తిప్పికొట్టడం, తదితర అంశాలపై ప్రజలకు వివరించాలని భావిస్తున్నది. పథకం పేరు మార్పు వల్ల ఎలాంటి నష్టం జరగబోదని, గతంలో కంటే పని దినాలను మరింత పెంచినట్లుగా వాస్తవాలు తెలియజేయాలని పార్టీ భావిస్తున్నది. ప్రతి బూత్‌ను కార్యకర్తల ఆధారంగా బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ, ప్రజలతో మమేకం కావాలని నాయకులకు సూచించారు.
Also Read: BJP Telangana:హెచ్ఐఎల్‌టీ పాలసీ మున్సిపాలిటీల విలీనంపై.. ఈనెల 7న కమలం పార్టీ మహాధర్నా!
బూత్ కమిటీల నిర్మాణమే లక్ష్యంగా
బూత్ కమిటీల నిర్మాణమే లక్ష్యంగా బీజేపీ ముందడుగు వేయాలని నిర్ణయించుకుంది. బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, ఇలా అన్ని స్థాయిల్లో కమిటీల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాలని స్పష్టంచేసింది. జిల్లాల వారీగా వర్క్‌షాప్‌లు నిర్వహించి, మండల స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ పనిని విస్తరించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా రాబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంసిద్ధమవ్వడంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని కాషాయ పార్టీ నిర్ణయానికి వచ్చింది. అలాగే వారిపై ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించనుంది. ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తిచేయాలని పార్టీ భావిస్తోంది. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకాస్త సమయం ఉండటంతో ఆ కమిటీని తర్వాత ప్రకటించే యోచనలో పార్టీ ఉంది. రాబోయే ఎన్నికలను పర్యవేక్షించే ఉద్దేశంతో స్టేట్ ఎలక్షన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెబుతున్నారు. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తున్న కాషాయ పార్టీ వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుందనేది చూడాలి.
Also Read: BJP Telangana: అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ.. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్

