ఛత్తీస్‌గఢ్‌కు చేరుతున్న జిలిటిన్ స్టిక్స్ పేలుడు..
పదార్థాలపై నిగ్గు తేల్చిన తెలంగాణ పోలీసులు
మావోయిస్టులకు సప్లై చేసింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే..
ఇవి వారి వరకే పరిమితమా.. ఉగ్ర మూకలకు కూడా చేరుతున్నాయా?
కీసర ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా పేలుడు కంపెనీలు నడిపిస్తున్న జయరాం రెడ్డి
రాజకీయ నేతల అండదండలతో ప్రభుత్వ భూములకు ఎసరు
ఇల్లీగల్ అనుమతులతో దర్జాగా అనేక అక్రమాలు
రూ.10 జిలిటిన్ స్టిక్ రూ.100 అమ్ముతున్న వైనం
రూ.100 జిలిటిన్ స్టిక్‌ను రూ.10వేలకు అమ్ముతున్న మధ్యవర్తులు
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
Swetcha Investigation: సాల్వో ఇండస్ట్రీస్.. కీసర కేంద్రంగా పేలుడు పదార్థాలను తయారు చేసే సంస్థ. నిర్వాహకుడు జయరాం రెడ్డి. తన రాజకీయ పలుకుబడితో ప్రభుత్వానికి సైతం మస్కా కొట్టడంలో దిట్ట. అంతెందుకు, సర్కారు భూముల్లోనే సాల్వో ఇండస్ట్రీస్ సంస్థను నడిపిస్తున్నాడు. ఆ చుట్టూ రియల్ ఎస్టేట్ అంటూ సాగించిన దందాలెన్నో. దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నా, పోలీసులు, రాజకీయ నేతలు అటు దిక్కు చూడడం లేదు. ప్రజా ప్రతినిధులను తన దారికి తెచ్చుకుని కీసర పరిసరాల్లో జయరాం రెడ్డి సాగిస్తున్న బాగోతాలను ఇప్పటికే ‘స్వేచ్ఛ’ బయటపెట్టింది. సంచలన కథనాలను ప్రచురించింది. తాజాగా మరోసారి సాల్వో సంస్థపై చర్చ జరుగుతున్నది.
మావోయిస్టులకు అందుతున్నది సాల్వో నుంచేనా?
ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన నేపథ్యంలో వారికి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. అవన్నీ అక్రమంగా కీసర పరిసరాల నుంచే సరఫరా అవుతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మావోయిస్టులకు జిలెటిన్ స్టిక్ సరఫరా చేస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కొంతకాలం ఆర్ఎంపీగా పని చేసిన మురుగుపాలయ రాము, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రభుత్వ టీచర్‌ను 2014లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడు జగిత్యాల సమీపంలోని ధరూర్ క్యాంపులోని తన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సంపంగి సురేశ్, సంపంగి బాలకృష్ణతో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు. దాదాపు 10 లక్షల దాకా నష్టపోయాడు. కొన్నాళ్ల క్రితం మావోయిస్టులు రామును అడవికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేశాడు. మాటల సందర్భంలో వారికి పేలుడు పదార్థాలు కావాలని తెలుసుకుని వాటిని సమకూర్చాలని రాము భావించి పలు దఫాలుగా వారికి అందించాడు. దానికి ప్రతిఫలంగా లక్షల్లో డబ్బు సంపాదించాడు. జగిత్యాలలో తనకు క్వారీలు ఉన్నాయని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన రాము, వాటిని మావోయిస్టులకు చేరవేశాడు. అలా, మరోసారి ప్రయత్నించగా, ధర్మపురి రహదారిలోని పొలాస దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 400 జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 9 బెండిళ్ల డికార్డ్ ఫ్యూజ్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పేలుడు పదార్థాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పట్టుబడిన పేలుడు పదార్థాలు కీసర కేంద్రంగా తయారైనవేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also- OG Release Date: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ కూడా ఫిక్సయింది.. ఎప్పుడంటే?
ఇప్పటికైనా చర్యలుంటాయా?
కీసర పరిధిలో సాల్వోతోపాటు మూడు కంపెనీల దాకా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నాయి. వీటిలో ఏ కంపెనీ నుంచి మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా అయ్యాయనేది ఇప్పుడు తేలాలి. నిజానికి, పేలుడు పదార్థాల తయారీకి డీఎస్పీ స్థాయి పర్యవేక్షణ ఉండాలి. కానీ, అలాంటిదేం ఉండడం లేదు. దాని ఫలితంగానే మావోయిస్టులకు అవి చేరుతున్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా రెగ్యులరైజేషన్ చేసుకోవాలని చూస్తున్న సాల్వో కంపెనీకి ఇలాంటివి చేయడం అలవాటే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం, ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ నిర్లక్ష్యం చేయకుండా సాల్వో లాంటి కంపెనీలపై సోదాలు జరగాలనే డిమాండ్ వినిపిస్తున్నది. స్టాక్‌కు సంబంధించిన వివరాలపై దృష్టి పెట్టాలని అంటున్నారు. క్వారీలు, సిటీలో సెల్లార్ తవ్వకాల కోసం పేలుడు పదార్థాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇలా కొన్ని పక్కదారి పడుతున్నాయి. పది రూపాయలు అయ్యే సామగ్రిని వంద రూపాయలకు అమ్ముకుంటున్నారు. అలా అవి పక్కదారి పట్టి మావోయిస్టుల చేతికి చేరుతున్నాయి. సదరు కంపెనీలు జిలెటిన్ స్టిక్ మందుగుండును పెద్ద ఎత్తున స్టోరేజీ చేసి సరఫరా చేస్తున్నట్టు సమాచారం. దీనిపై దృష్టి పెట్టాలని లేకపోతే పెను ప్రమాదం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మావోయిస్టులకేనా.. ఉగ్రవాదులకూ చేరాయా?
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రకు ప్లాన్ జరిగింది. కానీ, ఇంటెలిజెన్స్ ముందుగానే పసిగట్టి ఇద్దరు స్లీపర్ సెల్స్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో వారు సంచలన నిజాలను బయటపెట్టారు. నగరంలో చాలాచోట్ల పేలుళ్లకు ముష్కరులు పథకం రచించారు. ఈ నేపథ్యంలో జిలెటిన్ స్టిక్స్ పెద్ద మొత్తంలో వీరు సేకరించారా అనే అనుమానం వ్యక్తం అవుతున్నది. ఎందుకంటే సాల్వో లాంటి కంపెనీలు పేలుడు పదార్థాలను అధిక రేటు ముట్టచెబితే చాలు ఎంతైనా సరఫరా చేస్తున్నాయి. రూ.10 జిలెటిన్ స్టిక్ రూ.100కు అమ్మితే, మధ్యవర్తులు ఏకంగా వేలల్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బే ప్రధానంగా వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల, మావోయిస్టులు, ఉగ్రమూకల చేతుల్లోకి పేలుడు పదార్థాలు చేరుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.
Read Also- Miss World 2025: అందాల పోటీల్లో అభాసుపాలు.. మొదట్నుంచీ అడ్డంకులే!