NIMS Hospital: తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital) అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలపై కాంగ్రెస్(Congress) సర్కార్ వేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి(Shanthi Kumari) కమిటీ నివేదికలో ఈ మధ్య షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిమ్స్‌లో కాంట్రాక్ట్(Contract), ఔట్‌సోర్సింగ్(outsourcing) ఉద్యోగాల పేరుతో ఏకంగా 300కు పైగా స్థానికేతరుల అక్రమ నియామకాలు జరిగాయని గుర్తించారు. దీని ద్వారా ఏటా రూ.7 కోట్ల 68 లక్షలకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని తేలింది. ఈ నాన్ లోకల్(Non-local) దందా వెనుక ఉన్న అధికారుల కుమ్మక్కుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఏటా రూ.7.68 కోట్ల అక్రమ దోపిడీ!
నిమ్స్ ఆసుపత్రిలో టెక్నీషియన్(Technician), నర్సింగ్(Nursing) విభాగాలలో స్థానికేతరుల పెత్తనం ఎక్కువైందనే విమర్శలున్నాయి. సుమారు 25 నుంచి 32 డిపార్ట్‌మెంట్లకు సంబంధించి 150 మందికి పైగా స్థానికేతరులే టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. నర్సింగ్ విభాగంలోనూ 50 మందికి పైగా నాన్ లోకల్స్‌కు స్థానం కల్పించారు. ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగికి నెలకు రూ.32,000 చొప్పున జీతం చెల్లిస్తున్నారు. ఈ 300 మంది అక్రమ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా రూ.64 లక్షలు, అంటే సంవత్సరానికి ఏకంగా రూ.7 కోట్ల 68 లక్షల భారీ మొత్తం రాష్ట్ర ట్రెజరీ నుంచి బయటి రాష్ట్రాల వారికి అక్రమంగా వెళ్లడం తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని అవమానించడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి.
27 ఏళ్ల నిరీక్షణ.. న్యాయం ఎప్పుడు?
నిమ్స్‌లో గత 27 సంవత్సరాలుగా టెక్నీషియన్ విభాగంలో ఒక్క పర్మినెంట్ నోటిఫికేషన్ కూడా వేయకపోవడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని తెలంగాణ(Telangana) నిరుద్యోగులు వాపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP)లో ఆంధ్రా ప్రాంతం వారు ఉద్యోగాలు దక్కించుకుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారే రాజభోగాలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం 25 నుంచి 32 విభాగాలకు హెడ్లుగా ఉన్న హెచ్‌వోడీ(HOD)లు, ఇన్‌చార్జులు ఆంధ్రా ప్రాంతం వారే. తెలంగాణ నిరుద్యోగులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా డైరెక్టర్ గానీ, ఇతర అధికారులు గానీ పెడచెవిన పెట్టడం ఈ కుమ్మక్కు దందాకు నిదర్శనంగా కనిపిస్తున్నది. నియామకాలు, నోటిఫికేషన్లు లేకుండా అంతర్గతంగా అంతా జరిగిపోవడం దోపిడీకి పరాకాష్టగా చెబుతున్నారు.
ఆరోగ్య మంత్రి చెక్ పెట్టాలి!
రాబోయే నెలల్లో ఈ అక్రమ నియామకాల గడువులు ముగియనున్నాయి. నవంబర్ 4వ తేదీన 36 మందికి, డిసెంబర్ 4వ తేదీన 250 మందికి పైగా కాంట్రాక్ట్ టెక్నీషియన్ల గడువు ముగియబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలని కోరుతున్నారు. నాన్ లోకల్స్‌కు ఎక్స్‌టెన్షన్ ఇవ్వకుండా తక్షణమే తొలగించాలని, వారి స్థానంలో అర్హులైన తెలంగాణ నిరుద్యోగులకే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ దోపిడీని ఆపి, తెలంగాణ యువత ఆశయాలకు న్యాయం చేయకపోతే రాష్ట్ర ఖజానాకు గండి పడుతూనే ఉంటుంది. నిరుద్యోగుల ఆవేదన అగ్నిలా రగులుతూనే ఉంటుంది.
Also Read: TIMS Hospitals: టిమ్స్ ఖర్చు తగ్గింపుపై సర్కార్ స్టడీ.. గత ప్రభుత్వం భారీగా అంచనాలు
