TIMS Hospitals: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ వ్యయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం అంచనాలను భారీగా పెంచిన నేపథ్యంలో, కాంగ్రెస్(Congress) సర్కార్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బడ్జెట్ తగ్గింపు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ తగ్గింపుతో ప్రజాధనం ఆదా అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది.
లోతుగా అధ్యయనం..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో వరంగల్(Warangal) ఎస్ఎస్‌హెచ్(SSH), అలాగే హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్(LB Nagar), అల్వాల్(Alwal), సనత్‌నగర్(Sanathnagar)లలో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ వ్యయం భారీగా పెరగడంపై కాంగ్రెస్ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసింది. మొదట నిర్ణయించిన అంచనా వ్యయం కంటే బీఆర్‌ఎస్ హయాంలో ఈ ఖర్చులు రెట్టింపు అయ్యాయి. దీనిపై సమీక్షించిన కాంగ్రెస్ సర్కార్, కొన్ని పనులను, అదనపు ఖర్చులను తగ్గించడం ద్వారా వ్యయాన్నినియంత్రించాలని నిర్ణయించింది.
Also Read: Jagan on Balakrishna: ఎంతపెద్ద మాట సార్.. బాలకృష్ణపై జగన్ షాకింగ్ కామెంట్స్!.. కౌంటర్ ఇస్తాడా?
పెంపు, తగ్గింపుల తీరు ఇలా..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మొదట రూ. 1100 కోట్లుగా అంచనా వేయగా, బీఆర్‌ఎస్ హయాంలో దీనిని ఏకంగా రూ. 2148 కోట్లకు పెంచారు. దాదాపు రెట్టింపు అయిన ఈ వ్యయాన్ని కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రూ. 1528 కోట్లకు తగ్గించింది.ఇక ఎల్బీనగర్ టిమ్స్‌కు తొలుత నిర్ణయించిన రూ. 900 కోట్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 1935 కోట్లకు పెంచింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యయాన్ని రూ. 1150 కోట్లకు కుదించింది.అదే విధంగా అల్వాల్ టిమ్స్ విషయంలో కూడా మొదట రూ. 897 కోట్లుగా ఉన్న అంచనాను బీఆర్‌ఎస్ రూ. 1519 కోట్లకు పెంచింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ దీన్ని రూ. 1196 కోట్లకు తగ్గించింది. దీనితో పాటు సనత్‌నగర్ టిమ్స్ కోసం ప్రారంభంలో రూ. 882 కోట్లు నిర్ణయించగా, బీఆర్‌ఎస్ హయాంలో రూ. 1126 కోట్లకు పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని స్వల్పంగా రూ. 1112 కోట్లకు తగ్గించడం గమనార్హం.
ప్రజాధనం ఆదాపై దృష్టి..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నాలుగు ఆసుపత్రుల అంచనా వ్యయం దాదాపు రూ. 6728 కోట్లకు చేరింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వ్యయాన్ని తగ్గించడం ద్వారా మొత్తం రూ. 4986 కోట్లకు పరిమితం చేసింది. ఈ వ్యయం తగ్గింపుతో వేల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.ఆరోగ్య రంగానికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూనే, నిర్మాణాల్లో అదనపు ఖర్చులకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Also Read: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో తీరని విషాదం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృత్యువాత
