❄️ చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం
❄️ 1970 – 80 దశకాల్లో అంతు చిక్కని దాడులు
❄️ 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసీలు
❄️ పామునూరులో ఊచకోతతో బెంబేలెత్తిన గ్రామాలు
❄️ నేటి వరకు అటువైపు చూడని గిరిజనులు
❄️ మావోయిస్టులకు సేఫ్ ప్లేస్.. భద్రతా బలగాల ఆపరేషన్
❄️ అసలు కర్రె గుట్టల్లో ఏముంది?
❄️ యురేనియం, ఐరన్, డైమండ్స్ ముడి సరుకు లభ్యమౌతుందా?
Karregutta Mystery: ఆపరేషన్ కగార్‌తో కర్రె గుట్టలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్‌గా ముద్ర పడిన ఈ గుట్టల చరిత్రప అందరూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రె గుట్టలపై ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ గుట్టలు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్లు. నల్లటి కొండలు, పచ్చటి చెట్లు, పక్షుల కిలకిల రావాలు. సెలయేటి పరవళ్లు, వెరసి స్వచ్ఛమైన వాతావరణానికి కర్రె గుట్టల ప్రాంతాలు ప్రత్యేక నిలయాలు. ఇలాంటి స్వచ్ఛమైన ప్రకృతిలో 1970, 80 దశకాల్లో ఆదివాసీలు అక్కడి గుహలను నివాస స్థావరాలుగా ఏర్పరుచుకుని జీవనం సాగించారు. కొంతమంది గుర్తు తెలియని శక్తులు మావోయిస్టులపై నిత్యం దాడుల పరంపర కొనసాగించడంతో బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలోనే 1990లో అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవ్ శర్మ(బీడీ శర్మ) ఆదివాసీలను గుట్ట పైనుంచి కిందకి రావాలని, వచ్చిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. కానీ, ఆచరణలో అది సాధ్యం కాలేదు. గుట్ట పైన ఉన్న సౌకర్యాలు కింద లేనప్పటికీ నివాసయోగ్యాలను తమకు చేతనైన స్థాయిలో చేసుకుని ఉంటున్నారు. పైన లభించిన అటవీ ఉత్పత్తుల్లాగానే కింద కూడా లభించడంతో పైకి వెళ్లాలని ఆలోచనను ఆదివాసీ ప్రజలు విరమించుకున్నారు. అలాంటి కర్రె గుట్టల ప్రాంతం రానురాను మావోయిస్టుల కోటగా మారిపోయింది.
తరుచూ ఘర్షణలు
ఈ ప్రాంతంలో అడవులు చుట్టూ ఉండడంతో కష్టతరమైన ప్రదేశంగా మారింది. మావోయిస్టులకు సురక్షిత ప్రదేశం అయింది. భద్రతా దళాలు మావోయిస్టులను ఎదుర్కోవడానికి, కార్యకలాపాలను అణచి వేయడానికి తరచుగా ఇక్కడ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భారీ ఎన్‌కౌంటర్లు జరిగిన సందర్భాలున్నాయి. ఈ గొడవల్లో చిక్కుకొని కొంతమంది అమాయక ఆదివాసీలు ప్రాణాలు సైతం కోల్పోయారు. కర్రె గుట్టల ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు, భద్రతా దళాల ఆపరేషన్ల నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ సంఘాలు, కుల సంఘాలు, పలు పార్టీల నేతలు కోరుతున్నారు.
అసలు కర్రె గుట్టల్లో ఏముంది?
కర్రె గుట్టల ప్రాంతం దాదాపు 287 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. నల్లటి గుట్టలతో కనిపిస్తుంటుంది. ఈ గుట్టల్లో ఐరన్‌కు సంబంధించిన ముడి సరుకు ఉందా అనేది అక్కడి ఆదివాసీలకు తెలీదు. కాళ్ల కిందనే ఖనిజ సంపద ఉందనేది వారు గ్రహించలేరు. కర్రె గుట్టల ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఎక్కడ తవ్వినా డైమండ్స్ బయటకు వస్తాయనే ప్రచారం ఉంది. దేశంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఖనిజ సంపద ఉన్నట్లుగా ప్రాచుర్యంలో ఉంది.
యురేనియం, ఐరన్, డైమండ్స్ ఉన్నాయా?
కర్రె గుట్టల గుహల ప్రాంతంలో యురేనియం పాయింట్ ఉన్నట్లు మావోయిస్టులు గుర్తించారా? ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ మకాం వేయాలనుకుంటుందా? అందుకే మావోయిస్టులు, కేంద్ర బలగాలకు మధ్య యుద్ధం జరుగుతోందా? అంటే మాత్రం అనేక డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. కర్రె గుట్టల ప్రాంతంలో యురేనియం, ఐరన్, డైమండ్స్‌తో పాటు 29 రకాల ఖనిజాలు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందుకోసమే గత పది సంవత్సరాల క్రితం కర్రె గుట్టల ప్రాంతానికి హెలికాప్టర్ వచ్చిందని స్థానికంగా తెగ మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల క్రితం కర్రె గుట్టల ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడే ఉన్నట్లుగా సమాచారం. ఖనిజ సంపద సర్వే కోసం వెళ్లి పడిపోయిందా? లేదంటే మరే పనికి అయినా వెళుతూ అనుకోకుండా ఎత్తుగా ఉన్న గుట్టను సిగ్నల్స్ లేని కారణంగా ఢీ కొట్టిందా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.
గుట్టల పైనుంచి వచ్చిన ఆదివాసీలు 20 గ్రామాల్లో ఆవాసాలు
1990లో అంతగా టెక్నాలజీ లేదు. అలాంటి సమయంలోనే గుర్తు తెలియని శక్తులు ఆదివాసీలపై దాడి ఎందుకు చేశారో వారికి అర్థం కాలేదు. గుట్టల ప్రాంతం నుంచి కింద ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న ఓ గ్రామం పామునూరు గ్రామస్తులను ఎందుకు ఊచకోత కోశారు? ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. కర్రె గుట్టల పైనుంచి వచ్చిన ఆదివాసీలు కానూరు, జెల్లా కాలనీ, డోలి, చెలిమల, పామునూరు, కలిపాక, ముత్తారం, పెంక వాగు, సీతారాంపురం, పెనుగోటి కాలనీ, ఒంటిమామిడి, బొల్లారం, ఆరుగుంటపల్లి, ప్రగల్లపల్లి, ముర్మూరు, కరీవేణి గుంపా, మల్లాపురం గ్రామాలను ఆవాసాలుగా చేసుకుని ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. తాజాగా కర్రె గుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరుగుతున్న సంఘర్షణతో ఆదివాసీ గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి.
విరివిగా డైమండ్స్, ఐరన్ లభ్యం
కర్రె గుట్టల ప్రాంతంలో విరివిగా డైమండ్స్‌కు సంబంధించిన ముడి సరుకు, ఐరన్‌కు సంబంధించిన ముడి సరుకు కూడా లభ్యమవుతుందనే విస్తృత ప్రచారం సాగుతోంది. అయితే ఐరన్, యురేనియం, డైమండ్స్‌లతో పాటు 29 రకాల ఖనిజ ఉత్పత్తికి మావోయిస్టులు అడ్డుగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ దాడులకు పూనుకుందా అనేలా చర్చ జరుగుతున్నది.
Also Read: Hero Sumanth: మృణాల్ తో పెళ్లి .. సుమంత్ అలా అనేశాడేంటి.. మాకు నమ్మకం లేదు దొర అంటున్న నెటిజన్స్?
యురేనియం కోసం ప్రత్యేక టన్నెల్ ద్వారా రైలు మార్గం?
కర్రె గుట్టల ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న యురేనియం తవ్వకాల కోసం ప్రత్యేక టన్నెల్ ద్వారా రైలు మార్గం వేసేందుకు ప్రణాళిక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందనేది మరో వాదన. యురేనియం విమాన సంబంధిత మెటీరియల్ కోసం ఉపయోగిస్తారు. ఇది బంగారం కంటే విలువైన ఖనిజంగా భావిస్తుంటారు. ఇకపోతే రాళ్లలో ఐరన్ లభించడంతోపాటు కర్రె గుట్టల ప్రాంతంలో డైమండ్స్‌కు సంబంధించిన కొన్ని కడ్డీలు మొక్కల్లాగా భూమిలో నుంచి పైకి ఎదుగుతాయట. భూమి నుంచి బయటకు వచ్చి నిటారుగా నిలిచి ఉంటాయట. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఐరన్ నిక్షేపాలు ఉన్నాయని, ఒక్క చిన్న రాయి తీసుకొచ్చి కొలిమిలో పెడితే గొడ్డలి తయారయ్యేంత ఇనుప ఖనిజం వస్తుందని అక్కడివారు తెగ మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.