Illegal Constructions: గ్రేటర్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ (GHMC) లో పారదర్శకంగా భవన నిర్మాణ (Building construction) అనుమతులు జారీ చేసేందుకు ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా, ఫలితం దక్కటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు, అక్రమార్కులు సిటీలోని కొందరి ప్రైవేటు, సర్కారు భూముల్లో నిర్మాణాల (Illegal Constructions) కోసం అడ్డదారిలో అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక వైపు శివార్లలో కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు ఫేక్ డాక్యుమెంట్లతో పేదలకు భూములు విక్రయించటం, ఆ తర్వాత ఆ విక్రయాలు అక్రమంగా జరిగాయన్న విషయాన్ని హైడ్రా టెక్నికల్ గా నిర్థారించుకుని, పేదలు నిర్మించుకున్న నివాసాలను తొలగించిన ఘటనలు వరుసగా ఇటీవలే తెరపైకి వచ్చాయి.
Also Read: Forrest camp: అడవిలో క్యాంపింగ్.. 3 రోజులు చెట్ల మధ్య జీవిస్తే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
ఓ ఎమ్మెల్యే అండతో ఫేక్ డాక్యుమెంట్లు
ఆక్రమణంటూ హైడ్రా కూల్చేస్తున్నా, నిలువ నీడ లేక తక్కువ ధరకే వస్తుందన్న ఆశతో కొనుగోలు చేసిన పేదలు రోడ్డున పడుతుండగా, పేదలకు ఫేక్ డాక్యుమెంట్లతో విక్రయించిన రాజకీయ నేతలు ప్రజాప్రతినిధులకు మాత్రం శిక్షలు పడకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే విద్యానగర్ లోని ఓ ప్రైవేటు ల్యాండ్ లో అడ్డదారిలో నిర్మాణ అనుమతుల కోసం కొందరు ప్రైవేటు వ్యక్తులు ఓ ఎమ్మెల్యే అండతో ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి, నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అనుమతి కోసం తప్పుడు పార్టీషన్ దస్తావేజు సమర్పించి, డాక్యుమెంట్ కు లింక్ డాక్యుమెంట్ లేకుండానే అనుమతులకు దరఖాస్తు చేయటంతో అనుమానం వచ్చిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ భూమిపై క్లారిటీ కోసం ఫైలును హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కు పంపినట్లు సమాచారం. అనుమతి కోసం అక్కడ కూడా ఎమ్మెల్యే అండ్ అదర్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గతంలోనూ…
ఉప్పల్ లోని కల్స లక్ష్మీ నారాయణ కాలనీలో అక్రమ నిర్మాణాలకు( (Illegal Constructions) )సంబంధించి ఇటీవలే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు కాలనీ వెలసిన సర్వే నెంబర్ 581/1 లో అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు ఏడాది క్రితం గుర్తించిన వ్యవహారం తెల్సిందే. ఏళ్ల క్రితం ఇక్కడ రెండు బ్లాకుల్లో నిర్మించిన దాదాపు 20 ఇండ్లకు సంబంధించి తొలుత పత్రాలు చూపించాలని రెవెన్యూ అధికారులు ప్రశ్నించగా, యాజమానులు నీళ్లు నమిలారు. వారి వద్ద ఎలాంటి పత్రాల్లేవని నిర్థారించుకున్న స్థానిక రెవెన్యూ అధికారులు ఆ తర్వాత సర్వే నెంబర్ 581/1 కు సంబంధించి రెవెన్యూ రికార్డులను పరిశీలించగా, కల్స లక్ష్మీ నారాయణ కాలనీలోని సర్వే నెంబర్ 581/1 లో ఏడు ఎకరాల సర్కారు భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు.
అధికారులు లోతుగా పరిశీలించి దరఖాస్తును తిరస్కరిస్తారా?
నిర్మాణ అనుమతులను జారీ చేయాలంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఇటీవలే జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలికి లేఖ రాయటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఒకే భవనంలోని రెండు బ్లాకుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు వారి సమాధానం సంతృప్తిగా లేనట్లయితే తదుపరి చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దంగా ఉంది. నిర్మాణ అనుమతులను జీహెచ్ఎంసీ రద్దు చేసిన వెంటనే ఈ రెండు బ్లాకుల్లోని నిర్మాణాలను కూల్చి వేసేందుకు రెవెన్యూ శాఖ సిద్దమయింది. ఇపుడు విద్యానగర్ లో కూడా ఫేక్ డాక్యుమెంట్లతో సమర్పించిన దరఖాస్తును, డాక్యుమెంట్లను అధికారులు లోతుగా పరిశీలించి దరఖాస్తును తిరస్కరిస్తారా? లేక రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి అడ్డదారిలో అనుమతులు మంజూరు చేస్తారా? వేచి చూడాలి.
Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం: శ్రీనివాస్ గౌడ్
